Rahul Gandhi Latest:పదేళ్లు అధికారానికి దూరమై.. మోదీ చేతిలో అనేక దెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎలాగైనా గెలింపిచాల్సిన బాధ్యత ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఉంది. అంతేకాదు.. 2019లో దారుణ ఓటమితో వదులుకున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రెండుమూడేళ్ల తర్వాతైనా మళ్లీ చేజిక్కించుకోవాలంటే రాహుల్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి. లేదంటే ప్రతిపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా ఆయన మాట వినరు. అటు అనారోగ్యం, వయోభారం రీత్యా తల్లి సోనియాగాంధీ ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు. దీంతోనే రాహుల్ గాంధీకి రెండు నెలల్లొ జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకం. నాయకుడిగా చావోరేవో పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆయనకో రాజకీయ చిక్కొచ్చిపడింది. అదికూడా తమ మిత్ర పక్షం నుంచే కావడం గమనార్హం.
అమేథీ ఓడిస్తే వాయనాడ్ గెలిపించింది
గాంధీల కుటుంబానికి యూపీలోని అమేథీ పెట్టని కోట. అలాంటిచోట 2019 ఎన్నికల్లో రాహుల్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఇది ఆ పార్టీకి పెద్ద దెబ్బనే. అయితే, ఎందుకనో రాహుల్ రెండు చోట్ల పోటీ చేయడం మంచిదైంది. రెండో నియోజకవర్గమైన కేరళలోని వాయనాడ్ ఆయనను గెలిపించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో తమకు ఈ సీటు కావాలంటోంది సీపీఐ. ఎప్పటినుంచో వాయనాడ్ లో తాము గెలుస్తున్నామని చెబుతోంది. బీజేపీని ఢీకొట్టాలంటే ఉత్తరాదికి వెళ్లు అని కూడా సలహా ఇస్తోంది. విశేషం ఏమంటే.. 2019లో రాహుల్ వయనాడ్ లో సీపీఎం అభ్యర్థి మీద నాలుగు లక్షలపైగా ఓట్లతో గెలిచారు. ఇప్పుడు రెండో వామపక్షం సీపీఐ మాత్రం ఈ సీటును తమకే ఇవ్వాలంటోంది. ఇప్పటికైతే రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోలేదు.
ఆ కమిటీలో నారాయణ
వాయనాడ్ అంశమై తేల్చేందుకు సీపీఐ అంతర్గతంగా వేసుకున్న కమిటీలో ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కె.నారాయణ ఒక సభ్యుడు కావడం గమనార్హం. నారాయణ ఇప్పుడు సీపీఐ జాతీయ కార్యదర్శిగానూ ఉన్నారు. మరో విశేషం ఏమంటే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.రాజా. ఆయన భార్య పేరు అన్నీ రాజా. వయనాడ్ లో పోటీ చేయాలనుకుంటున్నది కూడా అన్నీ రాజానే. చివరకు ఈ వ్యవహారం ఏదో ముదిరేలానే ఉంది.