Puri Janaganamana:
కొంతమందికి డ్రీమ్ ప్రాజెక్ట్‌లు అంటూ కొన్ని ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ కోసం వాళ్లు లైఫంతా పెడతారు. ఎన్ని సినిమాలు చేసినా వారి దృష్టంతా ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌పైనే ఉంటుంది.
అటువంటి డ్రీమ్ ప్రాజెక్టే ‘‘జనగణమణ’’. దర్శకుడు పూరి జగన్నాద్ కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే ఓ యుద్ధంలా ఉంటుంది. ఎంతో పోరాటం చేస్తే కానీ అది ఓ కొలిక్కిరాదు.
ఉదాహరణకు ‘ఇడియట్’ సినిమానే తీసుకుంటే మొదట హీరో రవితేజ కాదు. అలాగే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ పూరీ తొలుత అనుకున్న హీరో రవితేజ కాదు.
ఇలా తన కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మొదట ఒక హీరోని అనుకున్నా, తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఈ హీరోలు మారిపోయి అన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాలకు హీరోగా రవితేజ నటించారు.
ప్రస్తుతం పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఈ సినిమాను మొదట మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తారు అని చాలాకాలం అనుకున్నారు.
ఆయన సినిమా చేయకపోవటంతో తర్వాత ఆ కథను మహేశ్‌బాబుకి చెప్పారు పూరీ. మహేశ్‌కూడా నో చెప్పటంతో ‘జనగణమణ’ కథ యంగ్ సెన్సేషన్ విజయ్‌దేవరకొండ దగ్గరికి వచ్చింది.
‘జేజియం’ కథను విజయ్ ఒప్పుకోవటంతో దేశం మొత్తం ఆ సినిమా గురించి మట్లాడుతున్నారు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి సరైన హీరో కుదిరాడు అనుకున్నారంతా.
అంతా బావుందికదా అని ఎంతో అట్టహాసంగా సినిమాని ముంబైలో ఓపెనింగ్ చేసి కొంత భాగం షూటింగ్ చేశారట.
‘జనగణమణ’ ఫెయిల్ అవుతుందేమో
ఈ సినిమా మేకోవర్ భారీఎత్తున జరగనుందని బిజినెస్‌ని కూడా ఇంటర్నేషనల్ రేంజ్‌లో చేయనున్నారని పెద్దెత్తున ప్రచారం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.
ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని కార్పోరేట్ రంగంలా మార్చే దమ్మున్న నిర్మాతలు, రియల్టర్స్ మైహోమ్ గ్రూప్ అధినేతలు
ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పుదాం అనుకున్నారు. కట్ చేస్తే ఆగస్ట్ 25 అనే డేట్ అందరి అంచనాలను తలక్రిందులు చేసింది.
ఆ డేట్‌లో రిలీజైన ‘‘లైగర్’’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటకట్టుకోవటంతో సినిమా కోసం వచ్చిన నిర్మాతలంతా మూటముల్లె సర్దుకున్నారు.
ఇలాంటి పరిస్థితులన్ని క్రియేటివ్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలోనే జరుగుతాయి. ‘లైగర్’ సినిమా ఫెయిల్ అయిందని ‘జనగణమణ’ కూడా ఫెయిల్ అవుతుందేమో అనుకోవటం పెద్ద తప్పు.
దర్శకునిగా జగన్‌కి సినిమాలు ఫెయిలవటం, హిట్టవ్వటం కొత్తేం కాదు. పూరీ ఎక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు (పాతాళం)లేవు.
ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనే పూరీ తత్వానికి తగినట్లుగా పరిస్థితులు ఉన్నాయి. దర్శకుడు పూరీ జగన్నాద్ సముద్రపు కెరటం లాంటోడు.
పడిన ప్రతి కెరటం మళ్లీ విజృంభించి పైకి లేస్తుందని అని అందరికి తెలుసు. పూరీ కూడా మళ్లీ పైకి లేస్తాడని తెలుసు.
చూద్దాం పూరీ కలల ప్రాజెక్ట్ ‘జనగణమణ’ సినిమాగా వస్తుందో రాదో? వస్తే ఏ హీరోతో వస్తుందో? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలే?..
శివమల్లాల
Also Read This : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?