Viswambhara: అద్భుతమైన ప్రపంచం తరువాత.. రిలీజ్ డేటెప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వశిష్ఠ దర్శకత్వంలో భిన్నమైన సోషియో ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన పుస్తకాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనొక ఆసక్తికర పోస్ట్ కూడా పెట్టారు. అదేంటంటే… ‘విశ్వంభర’ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకురానుందని.. పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలని పేర్కొన్నారు.

వాస్తవానికి ‘విశ్వంభర’ టీజర్‌ను కేన్స్‌లో విడుదల చేస్తారంటూ గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. కానీ దీనికి భిన్నంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ మేకర్స్ పుస్తకాన్ని విడుదల చేశారు. అసలు ఆ పుస్తకమేంటి? దానిలో ఏముందనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. త్వరలోనే విడుదల చేస్తామని మాత్రం ప్రకటించారు. అయితే చిరు అభిమానులు మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నారు. అద్భుతమైన ప్రపంచం సంగతి తర్వాత అసలు సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండని ప్రశ్నిస్తున్నారు. జనవరిలో విడుదల చేస్తామన్న సినిమా అతీగతీ లేదని నిట్టూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికర విశేషాలు అయితే వినిపిస్తున్నాయి కానీ విడుదల తేదీ మాత్రం వినిపించడం లేదు. దాని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *