Premendar Reddy :
గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతకే మళ్లీ అవకాశం
నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది.
రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు.
చివరకు గత గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రేమేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ప్రేమేందర్ రెడ్డి రేపు ఉదయం 11గంటలకు నల్గొండలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మే 2న ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మే 9 చివరి తేదీగా ఉంది.
మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఉంది. మే 27 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
జూన్ 5 ఫలితాలు ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తారు. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు.
పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీన్మార్ మల్లన్నపై విజయం సాధించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్సీ పదవి కాలం 2027 వరకు ఉంటుంది.
Also Read This Article : పంజాబి సినిమాకి రచయితగా జనార్ధన మహర్షి