Pratishta of Bala Ram:అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయింది. కోట్లాదిమంది భారతీయుల కల నెరవేరింది. 500 ఏళ్ల పోరాట
ఫలితం కళ్ళ ముందు సాక్షాత్కరించింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాణ ప్రతిష్ట
కార్యక్రమాన్ని అట్టహాసంగా పూర్తి చేసింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేశారని విపక్షాలు విమర్శించినా, గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణ
ప్రతిష్ట చేయడం ఏంటని నలుగురు శంకరాచార్యలు ప్రశ్నించినా… అటు ఆలయ కమిటీగానీ, ఇటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గానీ పెద్దగా
దాన్ని పట్టించుకున్నట్టు లేదు. ఇదిలా ఉండగా, మరోవైపు కేంద్రంలోని బిజెపి త్వరలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉందని కథనాలు
వస్తున్నాయి. అందుకే రామాలయాన్ని హడావుడిగా ప్రారంభించడమే కాకుండా ఒక రాజకీయ ఈవెంట్ లాగా మార్చారని పలువురు విశ్లేషకులు
భావిస్తున్నారు.
రామాలయం రాజకీయంగా బిజెపికి మేలు చేస్తుందా?
దీంట్లో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. రామాలయం అంశం కచ్చితంగా బిజెపికి మేలు చేస్తుంది. ఇప్పుడు దేశం దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికలకు వెళ్తే అది కచ్చితంగా బిజెపికి లాభిస్తుంది. బిజెపి వల్లే రామాలయ నిర్మాణం పూర్తయిందని దేశ ప్రజలు భావిస్తున్నారు. రామాలయాన్ని రాజకీయం చేశారన్న విపక్షాల వాదన ప్రజల చర్చల్లో ఎక్కడా కనిపించడం లేదు. గుడి నిర్మాణం పూర్తికాకముందే విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఏంటన్న శంకరాచార్యుల అభ్యంతరాలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అద్వానీ రథయాత్ర, మోదీ సంకల్పం వల్లే ఆలయం పూర్తి అయిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
ప్రాణ ప్రతిష్టకు వెళ్లకుండా విపక్షాలు తప్పు చేశాయా?
దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యే అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి అయోధ్యలో 500 ఏళ్ల పోరాటం తర్వాత బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంటే రాజకీయాలకతీతంగానే చూడాలి. కానీ విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడంతో ప్రజల్లో వాళ్ళు హిందూ వ్యతిరేకులు అన్న భావన వస్తోంది. ఇది రాబోయే లోక్ సభ ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
విపక్షాల దిద్దుబాటు చర్యలు
రామాలయ ట్రస్టు ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ తదితర విపక్షాలు ఆ తర్వాత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని దిద్దుబాటు చర్యలను ప్రారంభించాయి. తాము హిందూ వ్యతిరేకులం కాదని, హిందువులమేనని, తాము కూడా భక్తులమేనని చెప్పుకోవడానికి రామాలయం ప్రారంభం రోజే వేరు వేరు ఆలయాల్లో పూజలు నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఓ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. మమతా బెనర్జీ బెంగాల్లో ఓ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం సమరసతా ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ సీఎం, ఆఫ్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేసి గత ఐదు రోజుల నుంచే ఢిల్లీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. వేరే ఇతర పార్టీల సీనియర్ నేతలు కుడా అయోధ్యకు వస్తామని ప్రకటించారు.