Prashanth Kishore :
సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో చర్చ దారితీస్తున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ పాలనను లక్ష్యంగా చేసుకుంటూ పీకే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు.. ప్రతిపక్ష టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలకు ఆయుధంగా మారాయని స్పష్టం అవుతోంది. అసలే వచ్చేసారి ఏపీలో ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నాయి. వైఎస్ జగన్ సర్కారు.. సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకెళ్తోంది. ప్రజల జీవనాలను మార్చేందుకు తాము అనుసరిస్తున్న విధానమే సరైనదని అంటోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీది విధ్వంసక పాలన అని.. రాజధాని కూడా లేకుండా చేశారని ఆరోపిస్తోంది. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే ఉన్న సమయంలో మధ్యలో పీకే రంగప్రవేశం ఎవరి ప్రయోజనాల కోసం? అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.
నవరత్నాలు పీకేకు తెలియవా..?
వైసీపీ 2019 ఎన్నికల్లో గెలుపునకు కీలకం నవరత్నాలు. 9 అంశాలతో సంక్షేమ పాలన అందిస్తామని జగన్ స్పష్టంగా చెప్పారు. 2017 ప్లీనరీ సందర్భంగానే వీటిని వెల్లడించారు. అదే సమయంలో వైసీపీకి ప్రశాంత్ కిశోర్ సేవలందిస్తారని పార్టీ కేడర్ కు పరిచయం చేశారు. అనంతరం సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగానే అధికారం చేపట్టాక నవ రత్నాలను అమలు చేస్తున్నారు. మధ్యలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆర్థికంగా ఖజానాకు ఆదాయం తగ్గినా.. సంక్షేమ పథకాల అమలులో మాత్రం ఎక్కడా తగ్గలేదు. బటన్ నొక్కి నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు వీటినే నేరుగా ప్రశాంత్ కిశోర్ తప్పుబడుతున్నారు. అంటే.. తాను వైసీపీకి పనిచేయడం తప్పేనని ఒప్పుకొంటున్నారా? సంక్షేమం తప్పని అంటారా? మరి టీడీపీ కూడా సంక్షేమ పథకాలను రద్దు చేస్తాం అని చెప్పడం లేదు కదా? సంక్షేమ పథకాలను ఆపేస్తాం అనడం లేదు కదా? అంటే ఆ పార్టీ కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లా?
వైసీపీకి పనిచేస్తూ.. టీడీపీ అధినేతను కలుస్తారా?
ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తోంది.. తాను మాత్రం పనిచేయడం లేదంటారు. ఇందులో లాజిక్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా ఇది రాజకీయ వ్యూహకర్తల కాలం. 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు సైతం రాబిన్ శర్మ (మాజీ ఐప్యాక్) సేవలను పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తగుదునమ్మా? అంటూ చంద్రబాబును కలవడంలో ఆంత్యర్యం ఏమిటి? ఇది ధర్మం ఎలా అవుతుంది? ప్రొఫెషన్ కు ద్రోహం చేసినట్లు కాదా?
ఇష్టానుసారం పంచడం కాదు.. సంపద పెంపు
జగన్ ఏపీలో ఇష్టానుసారం డబ్బులు పంచుతున్నారని పీకే అంటున్నారు. పాలకుడు చేయాల్సింద సంపద పెంపు అని చెబుతున్నారు. వైసీపీ వర్గాలు, సీఎం జగన్ చెబుతున్నది అదే కదా..? తాము నేడు చేస్తున్న పని రేపటికి సంపద పెంపు కోసమే అని అంటున్నారు. ఇప్పుడు వేస్తున్న పునాది ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని పేర్కొంటున్నారు. ఇది పీకేకు తప్పుగా కనిపించిందా?
జగన్ లో ఆ లక్షణం మీకు కనిపించలేదా..?
ఏడేళ్లుగా వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే.. జగన్ ప్రజలు తనను దేవుడిగా చూడాలని కోరుకుంటున్నారట.. ఆ సంగతి ఎన్నికల ముందు కానీ, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కానీ గమనించలేకపోయారా? పేరుగాంచిన వ్యూహకర్త ప్రశ్రాంత్ కిశోర్.
బీఆర్ఎస్, బీజేపీ పక్షమని చెప్పారా?
జగన్ ఎపుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంశాలవారీగా బీజేపీకి మద్దతిచ్చారే తప్ప.. నేరుగా కాదు. ఇక పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ తో లడాయి లేకుండా వెళ్లారు. ఇది ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకూ ముఖ్యమే. కానీ, దీనిని బీజేపీ, బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్లుగా పీకే భావించడం ఏమిటి?
ఇదేం ధర్మం..?
తాను నిజం చెప్పకుంటే ప్రొఫెషన్ కు ద్రోహం చేసినవాడిని అవుతానని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు. కానీ, ఇప్పుడు చేస్తున్నది ద్రోహమే కదా..? సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రత్యర్థిని సాయం చేసేలా ‘జగన్ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రానురాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అసాధ్యం. జగన్ కు మామూలు ఓటమి కాదు. ఘోరంగా ఓడిపోబోతున్నారు’’ అంటూ తేల్చిచెప్పడం ఏవిధంగా ధర్మం?.
Also Read This : ఒక్క యుద్ధం.. ఒక్క రోజే ఇన్ని సంచలనాలా?
