Political In Shoe :
ఎర్రటి ఎండలో మన పాదాలను కాపాడేవి చెప్పులు.. అందుకే వాటిని పాద రక్షలు అంటారు.. అలాంటి చెప్పులు ఇప్పుడు ఓ సులువైన వస్తువుగా చేతిలో ప్రదర్శనకు వస్తున్నాయి.. అంతే సులువైనవిగా కోపంలో దాడికి ఆయుధాలుగా మారుతున్నాయి. ఇదంతా ఎందుకు చెపుకోవాల్సి వస్తున్నదంటే.. ఇటీవలి కొన్ని పరిణామాల నేపథ్యమే.
రాజకీయాల్లో హుందాతనం తగ్గింది.. ఎస్. నిజమే.. ఒకప్పుడు ప్రత్యర్థిని మీరు అనే సంబోధించేవారు. ఇప్పుడది నువ్వు అనే స్థితికి వచ్చింది. ఆరోపణలు వస్తే వివరణలు ఇచ్చేవారు.. కానీ, ఇప్పుడు దూషణలకు దిగుతున్నారు. విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీనికంటే పరాకాష్ఠ.. ప్రత్యర్థిని ఇతరులతో వ్యక్తిగతంగా తిట్టించడం మరొక దుస్పంప్రదాయంగా మారిపోయింది.
ఒకప్పుడు అవతలి వారి మీద కోపం వస్తే చేతులతో దాడికి దిగేవారు. దీనినే ముష్ఠిఘాతాలు అనేవారు. ఆ తర్వాత కాళ్లకు పనిచెప్పడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు వాటికి వేసుకునే చెప్పులతో దాడి చేస్తాం అంటున్నారు. అంటే.. కత్తులు అనే మారణాయుధాలు పోయి చెప్పులు అనే సాత్విక ఆయుధాలు వచ్చాయన్నమాట.
అటు ఇటు ఎటుచూసినా..
తెలంగాణలో ఇటీవల అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందులోనూ బీఆర్ఎస్ పదేళ్ల తర్వాత ప్రతిపక్షంలోకి మారింది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో సహజంగానే అసహనం ఉంటుంది. ఇక తెలంగాణ ఇచ్చి సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ.. తాము పగ్గాలు చేపట్టిన మరుక్షణమే బీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలను తిరగదోడడం మొదలుపెట్టింది. ఈ పరిణామమే రాజకీయంగా ఉద్రిక్తతలు.. వాదోపవాదాలు.. ఘర్షణలకు దారితీస్తోంది. దీంట్లోభాగంగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చెప్పు చూపించి తీవ్ర దూషణలకు దిగారు. అయితే, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. స్వయంగా చెప్పు చూపించకుండా మరొక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని అతడితో చూపించారు. ఇక రెండేళ్ల కిందట ఏపీలోనూ ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేకుంది. అదికూడా పవర్ స్టార్, జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కావడం గమనార్హం. ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి పదేపదే వ్యక్తిగత విమర్శలు రావడంతో పవన్ కల్యాణ్ సహనం కోల్పోయారు. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆయన పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ అత్యంత ఆవేశంగా తన చెప్పును చూపించారు.
ఆయుధంగా చెప్పు..
రాజకీయంగానే కాదు.. ఇటీవలి కాలంలో వ్యక్తులలోనూ హుందాతనం తగ్గుతోంది. భూములకు రేట్లు రావడంతో డబ్బుపై ఆశ పెరగడం, మనుషుల మధ్య అడ్డుగోడలా సెల్ ఫోన్ రావడం.. ఇలా ఎన్నో విషయాల్లో వ్యక్తుల్లో అసహనం పెరిగిపోయింది. చిన్న విషయాలకూ వారికి కోపం వచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో ఏదైనా సంఘటన జరిగితే తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా బస్ కండక్టర్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఆ సందర్భంగా ఆధార్ కార్డు చూపించాలి. ఇదే అంశం ప్రయాణికుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. వాగ్వాదానికి దారితీస్తూ దాడులకు దిగేలా చేస్తోంది. సీట్లకోసం కూడా కొందరు మహిళలు చెప్పులతో కొట్టుకున్న ఉదంతాలు వెలుగుచూశాయి. ఇక పవన్ కల్యాణ్ పై తెలంగాణ ఎన్నికల సందర్భంగానూ చెప్పులతో దాడికి యత్నించడం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఉదాహరణలు ‘చెప్పు’కొంటూ పోతే ఎన్నో ఉన్నాయి.