Phone Tapping :
ఫోన్ ట్యాపింగ్..
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ అంశం.. ఇప్పుడు ఏపీలోనూ తెరపైకి వచ్చింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుండడంతో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరుగుతోందా? ప్రభుత్వంలో ఉన్నవారెవరైనా.. తమ ప్రత్యర్థుల కదలికలను తెలుసుకోవడానికి సహజంగానే వారి ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తారా?
అంటే జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం నిజమేనేమో అనిపించక మానదు.
వాస్తవానికి సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి.. దాని ద్వారా ఆయా శక్తుల కదలికలను ముందుగానే పసిగట్టి వారి చర్యలకు అడ్డుకట్ట వేస్తుంటుంది.
అయితే ఇది రానురాను ప్రభుత్వాల్లోని కొందరు పెద్దలకు ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి, వారి ప్రత్యర్థుల పైకి ప్రయోగించేలా మారింది.
ప్రభుత్వ పెద్దలు కూడా తాము కోరుకున్న పనిని అధికారులు అడగకుండానే చేసి పెడుతుండడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
అయితే కొందరు అధికారులు దీనిని అవకాశంగా మలచుకుని ఫోన్ ట్యాపింగ్ ను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పడు తెలంగాణలో జరిగింది అదే. ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో ఏమోగానీ.. అధికారులు చేసిన పనికి గత ప్రభుత్వానిన నడిపిన వారు అపనిందలు మోయాల్సి వస్తోంది.
ఇప్పటికే పలువురు అధికారులు అరెస్టయి.. జైల్లో ఉండగా, మరికొంత మంది అరెస్టయ్యే అవకాశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. కొందరు రాజకీయ నాయకులు కూడా అరెస్టవుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అన్ని టెస్టులకు సిద్ధంగా ఉన్నా…
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చివరికి ఈ అంశంపై స్పందించక తప్పలేదు.
తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తిన కేటీఆర్.. దీంతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
దీనిని నిరూపించుకునేందుకు లై డిటెక్టర్ టెస్టుకుగానీ, నార్కో అనాలసిస్ టెస్టుకుగానీ సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
పనిలో పనిగా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోన్ ను, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని అన్నారు.
అంతేకాదు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ట్యాపింగ్ కు పాల్పడుతుందని, పెగాసస్ సాఫ్టవేర్ తో మోదీ సర్కారు ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు.
తాను చేసిన ఈ ఆరోపణలు నిజం కావనుకుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడా తనతోపాటు లై డిటెక్టర్ పరీక్షలకు, నార్కో అనాలసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ చేశారు.
అయితే వీరి సవాళ్ల నేపథ్యంలో ప్రజలకు స్పష్టత వస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ట్యాపింగ్ కు పాల్పడటం సాధారణమేనన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. మరి ఈ పరిణామానికి సంబంధించి ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.
Also Read This Article : సినిమాను చంపేసే లాలూచి బ్యాచ్…
Also Read This Article : ఖాళీ కడుపుతో వ్యాయామం: నిజం ఏమిటి