కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్య విషయంలో ఎంత భయపడ్డారో ఏమో కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజ్నావా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించారు. మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూలులో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు. వెంటనే సింగపూర్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్ కుమారుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేశారు. కొడుకు క్షేమంగా తిరిగి రావాలని అన్నా తిరుమల శ్రీవారిని మొక్కినట్టున్నారు.
సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే తిరుమలకు వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం ఆమె సుప్రభాత సేవ సమయంలో శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. అయితే అన్నా అన్యమతుస్థురాలు కావడంతో డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం పెట్టిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారు. వేరే దేశస్తురాలు, పైగా అన్యమతస్థురాలు అయినా కూడా హిందూ సంప్రదాయాన్ని గౌరవించి చక్కటి చీరకట్టులో శ్రీ వేంకటేశ్వరునికి తలనీలాలు సమర్పించి దర్శించుకోవడం.. అది కూడా రూల్‌ను అతిక్రమించకుండా డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయడం వంటి అంశాలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వాస్తవానికి ఒక డిప్యూటీ సీఎం సతీమణిగా తమ అధికారాన్ని వినియోగించుకుని డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేయకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆమెను అడ్డుకునే వారెవరూ లేరు. అయినా కూడా అన్నా లెజ్నావా ఎక్కడా రూల్‌ను అతిక్రమించకపోవడం గమనార్హం.
ప్రజావాణి చీదిరాల