Pakistan-Iran:
పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఇరాన్ మంగళవారం ఆ దేశ భూభాగంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని పాకిస్తాన్ తెలిపింది.
తమ భూభాగంలో ఇరాన్ దాడులు చేయడం తమ సార్వభౌమాత్మానికే వ్యతిరేకమంటూ గురువారం ఉదయం పాకిస్తాన్.. ఇరాన్లో ఉన్న బలూచ్ ప్రావిన్స్ మీదనే దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారని అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఇరాన్ తెలిపింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు దేశాల లక్ష్యం ఒకటే.
శత్రువు ఒకరే. అదే జైష్ అల్ అదిల్ సంస్థ. ఇది ఒక వేర్పాటువాద సంస్థ.
రెండు దేశాల్లో బలూచ్ ప్రజలు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గ్రేట్ బాలుచిస్తాన్ పేరుతో ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఇది డిమాండ్ చేస్తోంది.
ఏంటీ గ్రేట్ బలూచిస్తాన్?
ఇరాన్, పాకిస్తాన్ మధ్య 909 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. దీన్ని గోల్డ్ స్మిత్ లైన్ అని కూడా అంటారు. ఈ లైన్ కు అటు పక్కన, ఇటు పక్కన 90 లక్షల మంది బలూచ్ ప్రజలు ఉన్నారు.
మరో ఐదు లక్షల మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి అటు ఇరాన్ ని, ఇటు పాకిస్తాన్ను వ్యతిరేకిస్తూ తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
20వ శతాబ్దంలో భారత ఉపఖండంలో దేశాల సరిహద్దులు రూపొందుతున్న సమయంలోనే ఈ డిమాండ్ మొదలైంది.
జైష్ అల్ అదిల్ పాత్ర
ఇరాన్ లో షియా రాచరిక రాజ్యం. అయితే బాలుచ్ ప్రజలు సున్ని తెగకు చెందినవారు. వీరుశియా పెత్తనాన్ని ఓర్వలేక పోతున్నారు. మరోవైపు పాకిస్థాన్లో బాలాజీ ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే బాలోచ్ ప్రజల మద్దతుతో ఈ వేర్పాటు వాద సంస్థ ఏర్పడింది. వీళ్లు ఆడపాదడపా ఉగ్రదాడులు చేస్తూ దేశ సరిహద్దులు దాటి పోవడం తరచుగా జరుగుతోంది.
ఇరాన్లో దాడి చేసిన వారు పాకిస్తాన్ కి వెళ్లి దాక్కోవడం, పాకిస్తాన్ లో దాడులు చేసిన వాళ్ళు ఇరాన్ లోకి వెళ్లి దాక్కోవడం చాలా కాలంగా కొనసాగుతోంది.
లక్ష్యం ఒకటే అయినప్పుడు పరస్పర దాదులెందుకు?
1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ కు ముందు పాకిస్తాన్, ఇరాన్ పరస్పరం సహకరించుకునేవి. వేర్పాటువాదంపై కలిసికట్టుగా పోరాడేవి.
అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ అమెరికాకు బద్ధ శత్రువుగా మారింది.
ఈ నేపథ్యంలో అమెరికా పాకిస్థాన్ ను దగ్గర తీసింది. దీంతో ఇరాన్, పాక్ మధ్య దూరం పెరిగింది. సంబంధాలు సన్నగిల్లడం ప్రారంభమైంది.
కొంతకాలంగా ఈ రెండు దేశాలు “మీరు వేర్పాటువాదులకు ఆశ్రయమిస్తున్నారంటే మీరు ఇస్తున్నారు” అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇటీవల ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఓ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే దాడులు చేశారని ఇరాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం పై దాడులకు పాల్పడింది.
ఇది రెండు దేశాల మధ్య యుద్ధంగా మారుతుందా?
ప్రస్తుతం ఇరాన్ అమెరికాతో శత్రుత్వం గాజాపైన ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు, హెజెబోల్లాకు మద్దతు, సున్నీ ఉగ్రవాదం.. వీటన్నిటితో తల మునుకలుగా ఉంది.
ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా సమస్యగా ఉన్న బలూచ్ పై పెద్దగా అది దృష్టి పెట్టకపోవచ్చు. మరోవైపు పాకిస్తాన్ కూడా రాజకీయ సంక్షోభం, అప్పులతో కొట్టుమిట్టాడుతోంది.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందన్న భారత వాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. ఈ సమయంలో పాకిస్థాన్ కొత్త తలనొప్పులు తెచ్చుకోకపోవచ్చు.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?