No Seat RRR :
బీజేపీ టికెట్ రాకుండా అడ్డుకున్న జగన్?
రఘురామ కృష్ణంరాజు.. 2019 లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి.. ఆపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి.. కేసులపాలై.. పోలీసులతో దెబ్బలు తిని.. చివరికి బీజేపీ పంచన చేరిన వ్యక్తి. అటు బీజేపీతో, ఇటు టీడీపీతో అనుకూలంగా వ్యవరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఆ కూటమి తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, అనూహ్యంగా రఘురామకు మొండి చేయి ఎదురైంది.
బీజేపీ అధిష్ఠానం ఆయనకు షాకిస్తూ.. భూపతిరాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో రఘురామ కృష్టంరాజు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. వాస్తవానికి పొత్తులో భాగంగా నరసాపురంలో ఏ పార్టీ నుంచైనా పోటీ చేయడం ఖాయమని ఆయన విశ్వాసంతో ఉన్నారు.
ఆయన పోటీ ఖాయమని కొందరు పందేలకు సైతం దిగారు. చివరి వరకు ఢిల్లీ బీజేపీ పెద్దలు రఘురామ వైపే ఉంటారని అందరూ భావించారు. దీనికి విరుద్దంగా ఆయనకు పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం చేజారింది. దీంతో రఘురామకు అవకాశం రాకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని అభిమానులు అంటున్నారు.
బీజేపీ నేతలతో తనకున్న సంబంధాల ద్వారా జగన్ కుట్ర పన్నారని, తనకు కొరకరాని కొయ్యగా మారారన్న ఉద్దేశంతోనే రఘురామకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. వారంతా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఆది నుంచి సీఎం జగన్ అవినీతిపైన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన దండెత్తిన రఘురామకు అటు బీజేపీ గానీ, ఇతర పార్టీలు గానీ అవకాశం లేకుండా చేయడం దారుణమని మండిపడుతున్నారు.
నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆయన అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నారు. కాగా, సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు.
రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో తెలిసిందన్న రఘురామ
సాధారణ కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా కచ్చితంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందడం ఖాయమని శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు.నరసాపురం టికెట్ దక్కకపోవడంతో రఘురామ కృష్ణంరాజు నిరాశలో కూరుకుపోయారు.
రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తనకు ముందు నుంచే తెలుసునని అన్నారు. అయితే ఇంత క్రూరంగా ఉంటాయని మాత్రం అనుకోలేదని వ్యాఖ్యానించారు. కానీ, తనకు టికెట్ దక్కకపోయినా.. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
Also Read This Article : విజయశాంతి అడ్రస్సెక్కడ?