New Delhi :
ఢిల్లీ పోలీసుల నోటీసులతో ఉత్కంఠ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం స్కెచ్ వేసిందా? అంటే.. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోను మార్పింగ్ చేశారంటూ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని, మార్ఫింగ్ వీడియోను షేర్ చేసిన డివైజ్ ను కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ నోటీసులపై స్పందించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘‘నన్ను అరెస్టు చేస్తారంట’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘హైదరాబాద్ గాంధీభవన్‌లో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారంట.. ఉన్న ఏజెన్సీలు చాలవన్నట్లు.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వాడుకుంటున్నారు’’ అని రేవంత్ విమర్శించారు.
బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయినా వారి పోలీసులు ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో బీజేపీని ఓడీంచి తీరుతామని ప్రకటించారు.
కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రేవంత్రెడ్డి.. గుజరాత్ ప్రజలు మోదీకి అండగా ఉన్నట్లే.. కర్ణాటక ప్రజలు కూడా మల్లిఖార్జున ఖర్గేకు అండగా నిలవాలని కోరారు.
కర్ణాటక నుంచి 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను కర్ణాటక వర్సెస్ గుజరాత్‌గా అభివర్ణించారు.
ఐదు గ్యారంటీలను కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్కచ్చితంగా అమలు చేసిందన్నారు రేవంత్. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ అధికారం చేజిక్కుంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిందని చెప్పుకొచ్చారు.
పదేళ్లలో మోడీ సర్కార్పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
‘‘గత పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి 27 ఎంపీ సీట్లు అనుకూలంగా మీరు ఇచ్చారు. కానీ నరేంద్ర మోదీ మీకు ఇచ్చింది ఖాళీ చెంబు మాత్రమే.
మీకు కరవు వస్తే కనీసం మీకు తాగటానికి కనీసం బెంగళూరుకు నీరు కూడా ఇవ్వలేదు. అటువంటి ప్రధానికి ఓటేస్తారో.. మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ఖర్గేకు ఓటేస్తారో మీరే ఆలోచన చేయండి’’ అని గుర్మిట్కల్ పార్లమెంట్ ప్రచారంలో రేవంత్ వ్యాఖ్యానించారు.
Also Read This Article : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ పేరును చేర్చింది జగనే?