Nellore Politics :
ఉమ్మడి ఏపీలో నెల్లూరు జిల్లాది ప్రత్యేక చరిత్ర.. భౌగోళికంగా తమిళనాడుకు దగ్గరం.. వాతావరణం కూడా కాస్త భిన్నం.. రాజకీయాల్లోనూ ఆ జిల్లాది ప్రత్యేక ముద్ర. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలుండగా నాలుగైదు జిల్లాల నేతలే సీఎం అయ్యారు. అందులో ఒక జిల్లా నెల్లూరు కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి వెంకటగిరి నుంచి గెలిచి ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు. ఇదే జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఈ జిల్లా నాయకులు వేరే జిల్లాలకు వెళ్లి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నెగ్గడం విశేషం. కాగా, మరో ప్రత్యేకత కూడా నెల్లూరు సొంతం. అదేమంటే.. ఒక పార్టీ అధికారంలో ఉండగా దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముసలం రేగితే చివరకు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుంది.
దూబగుంట రోశమ్మ
1994లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం. దానికి బీజం పడింది నెల్లూరు జిల్లా దూబగుంటలోనే కావడం గమనార్హం. అప్పట్లో సంసారాలను పీల్చిపిప్పి చేసిన సారాపై నిరసన చివరకు పెను ఉద్యమంగా మారి ప్రభుత్వాన్ని కూల్చడంలో సాయపడింది. ఇక రాజకీయంగా చూస్తే.. నెల్లూరు జిల్లా వైబ్రెంట్. అధికారంలో ఉన్న పార్టీలో ఆ జిల్లాలో గనుక ధిక్కార స్వరాలు, అసమ్మతి రాగాలు మొదలైతే.. ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి పడిపోతుంది.
1999 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా చక్రంతిప్పారు. ఆయనకు తిరుగులేదు అనే వాతావరణం ఏర్పడింది. అయితే, 2003 సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అసమ్మతి స్వరం వినిపించారు. వైఎస్ చొరవతో కాంగ్రెస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
2009 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ హవా సాగింది. అప్పటికే రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు వివేకానందరెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. లుకలుకలు ఏమీ లేకుండా రాజకీయం సాగింది. దీంతో 2009లో కాంగ్రెస్ మళ్లీ గెలిచింది.
వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఆనం కుటుంబం కాంగ్రెస్ లో ఇమడలేకపోయింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. దీంతోపాటే ఆ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా గెలిచింది. 2018 వరకు వైసీపీపై మీద విరుచుకుపడిన ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఆయన తమ్ముడు రామనారాయణరెడ్డి చివరకు వైసీపీలోకి వచ్చారు. తర్వాతి ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది.
మరి ఈసారి ఏమిటో?
ప్రస్తుతం ఏపీలో నెల్లూరు రాజకీయమే హైలైట్. ఆ జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏడాది కాలంగా వైసీపీని వీడారు. ఇటీవల వైసీపీ రాజ్య సభ ఎంపీ కూడా గుడ్ బై చెప్పారు. మరి.. ఎప్పటిలాగానే నెల్లూరు రాజకీయ దుమారం.. అధికార పీఠాన్ని కదిలిస్తుందా? అన్నది చూడాలి. దీనికి వచ్చే రెండు నెలల్లో సమాధానం దొరకనుంది.
Also Read This : AP Political News:24-24-24 జనసేన తొలి లిస్ట్ లో విశేషం.