Nani: 15 ఏళ్ల క్రితం ఒకమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని

నేచురల్ స్టార్ నాని, శైలేశ్‌ కొలను కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ (HIT 3). వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం వైజాగ్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. వైజాగ్‌తో తనకెంతో అనుబంధం ఉందని ఇక్కడి వారంతా తనను అల్లుడిగా చూస్తుంటారని చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినని నాని వెల్లడించారు. వైజాగ్‌లో అభిమానులనుద్దేశించి నాని మాట్లాడుతూ.. మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని అన్నారు. తన పెళ్లికి ముందు అంటే 15 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినని.. ఆ తర్వాత తననే పెళ్లాడానన్నారు.

గత 15 ఏళ్ల నుంచి కూడా మిమ్మల్ని (అభిమానులను) కలిసేందుకు వస్తున్నానని నాని తెలిపారు. అప్పుడు, ఇప్పుడూ తాను ప్రేమ కోసమే వైజాగ్ వస్తున్నానన్నారు. వైజాగ్ వాసులతో తనకు అంతటి అనుబంధం ఉందని.. వేరే ఊర్లకు వెళితే అక్కడి వారు తననొక సోదరుడిలా చూస్తారని.. వైజాగ్ వాసులు మాత్రం తనను అల్లుడిలా చూస్తారన్నారు. అది తనకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని నాని వెల్లడించారు. ప్రస్తుతం కొత్త జానర్‌లో అద్భుతమైన చిత్రాన్ని అందించబోతున్నామని తెలిపారు. తన నుంచి యాక్షన్ సినిమాలు కోరుకునే వారంతా మే 1వ తేదీన థియేటర్లకు వచ్చేయాలని పేర్కొన్నారు. తన నుంచి లవ్, ఫీల్‌గుడ్, ఫన్ చిత్రాలు కోరుకునేవారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. అన్ని రకాల చిత్రాల్లో నటించాలని కోరుకునే వారు మాత్రం తమ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *