మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి.రవి నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం.రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.
ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘‘డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ గారు వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని అన్నారు. దర్శకుడు నారాయణ్ మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో మురళీ మోహన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను చేయాలని మురళీ మోహన్ గారు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. ‘నాలుగు పాటలు, ఫైట్లు అంటూ సినిమాలు తీస్తున్న టైంలో ఇలా డొక్కా సీతమ్మ గారి కథతో గొప్ప సినిమాను తీస్తున్నారు. ఇలాంటి చిత్రాలే ఇప్పుడు రావాలి. నా వెన్నెంటే ఉండే మా మురళీ మోహన్ గారికి మరోసారి ఈ చిత్రంతో పెద్ద విజయం చేకూరాలి’ అని అన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘నా కెరీర్ ప్రారంభం నుంచీ మురళీ మోహన్ గారు నాకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు. నాకు జీవితంలో ఆయనే స్పూర్తి. ఆయన సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విజయాన్ని సాధించారు. ఈ డొక్కా సీతమ్మ గారి సినిమాతో ఆయనకు మరో విజయం దక్కాలి’ అని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల