శేఖర్ కమ్ముల తన సినీ ప్రస్థానాన్ని 2000వ సంవత్సరంలో ‘డాలర్ డ్రీమ్స్’ అనే చిత్రంలో మొదలు పెట్టారు. తెలుగు సినీ దర్శకుడు గానూ.. నిర్మాత, సినీ రచయితగా కొనసాగారు. ఈ 25 ఏళ్లలో తాను తీసిన చిత్రాలు వేళ్లపై లెక్కబెట్టగలిగినన్నే అయినా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రాలే ఎక్కువ. ‘ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్’ వంటి చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్‌గా మారారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా అద్భుతమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇలాంటి శేఖర్ కమ్ములకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చారు. ఇక శేఖర కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్‌ను కలిశారు. ఆయనను మెగాస్టార్ సైతం అభినందించడమే కాకుండా ఓ అద్భుతమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
‘‘మై డియర్ శేఖర్.. మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. మీరు 25 ఏళ్ల అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల