భద్రాద్రి రామయ్య తెలుగువారి ఇష్ట దైవం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచి భద్రాచలంలో సీతారాముల కల్యాణం కోసం భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. గోటితో తలంబ్రాలను వలిచి పంపేది కొందరైతే.. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించి ముత్యాల తలంబ్రాలను తమతో తెచ్చుకోవాలని కొందరు ఆరాటపడుతుంటారు. కల్యాణం అంటే సీతారాములదే అన్నట్టుగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు, వింజామర సేవలు, పన్నీటి చిలకరింపులు, సీతారాముల ఓరచూపులు… ఇంకా ఎన్నెన్నో దివ్యవిభూతులను భద్రాద్రి రామయ్య కల్యాణం భక్తులకు ఇస్తుంది. ప్రతి ఏటా కల్యాణం జరిగినా కూడా ఏ యేటికాయేడు కమనీయమే. ఎన్నిసార్లు తిలకించినా తనివి తీరనిది రామయ్య వివాహం.
భక్తులంతా సీతమ్మను తమ తల్లి.. రామయ్యను తండ్రిగా భావించి ప్రేమ, అనుగాగం మిళితమైన హృదయాలతో భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని వీక్షిస్తారు. ఇరవై నాలుగు వైదిక ప్రక్రియలతో మూడు గంటలపాటు ఈ కల్యాణం జరుగుతుంది. సీతారాముల కల్యాణానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు భద్రాద్రికి తరలి వచ్చారు. చలువ పందిళ్లు, చాందినీల అలంకారాలు, కర్పూర కళికల పరిమళాల నడుమ రామయ్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే.. అన్నింటికీమించి సీతారాములపై అనన్యమైన భక్తి మదినిండుగా మెండుగా ఉండగా భద్రాద్రి సీతారామ కల్యాణాన్ని వీక్షించి భక్తజనం తన్మయత్వం చెందింది. భద్రాద్రి సీతారామ కల్యాణం లోక కల్యాణం అన్నట్టుగా ప్రతి తెలుగు లోగిళ్లలో కల్యాణ శోభ వెల్లివిరుస్తుంది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘గర్ల్‌ఫ్రెండ్’ కోసం విజయ్ దేవరకొండ..
