‘హరి హర వీరమల్లు’లో ఒక అద్భుతమైన పాటకు సంగీత, సాహిత్యాలతో కీరవాణి ప్రాణం పోశారు. నేడు ఈ పాటను పవన్ కల్యాణ్‌కు వినిపించారు. పాట విన్న పవన్.. కంపోజిషన్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎవరికైనా పౌరుషం తగ్గితే ఈ పాటతో తిరిగి పౌరుషం వస్తుందన్నారు. పవన్‌తో కీరవాణి మాట్లాడుతూ.. ‘తొలిసారి మీతో చేస్తున్నానంటే.. అంతా ఆసక్తిగా చూస్తారు. అందుకు తగ్గట్టుగా ఉండాలి కదా’ అన్నారు. ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అంటూ సాగే ఈ పాట గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాట రేపు (బుధవారం) విడుదల కానుంది.
కీరవాణితో పవన్ సంభాషణ ఆసక్తిని రేకెత్తించింది. ఆయనతో ‘హరి హర వీరమల్లు’ టీం పవన్‌తో కాసేపు గడిపింది. ఈ కాస్త సమయంలోనే పవన్ వయోలిన్ వాయించారు. కీరవాణి దగ్గర ఉన్న వయోలిన్‌ను చూసి పవన్ దానిని తన చేతుల్లోకి తీసుకున్నారు. దానిని చిదంబరనాథన్ ఇఛ్చారని.. దానిని చాలా భద్రంగా దాచుకున్నానని కీరవాణి తెలిపారు. అలాగే తెలుగు కథలను ప్రేమించే కీరవాణి.. తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేశారు. దానిని పవన్‌కు బహూకరించారు. ఈ కథల్లో కీరవాణి రాసినవి రెండు ఉన్నాయి. ఆ తరువాత ఆస్కార్ అవార్డు గురించి పవన్ అడిగారు. దానిని చూపించమనగానే కీరవాణి.. పవన్‌కు ఇచ్చారు. ఆసక్తిగా పవన్ ఆస్కార్ అవార్డును తడిమి తిరిగి కీరవాణికి ఇచ్చారు.
ప్రజావాణి చీదిరాల