KTR vs Revanth :
ఎంతలో ఎంత మార్పు.. ! రెండు నెలల క్రితం దాకా బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ను ఓ ఆటాడుకుంటే.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు
విరుచుకుపడుతున్నారు. గులాబీ నేతల అధికార బలమో, ఉద్యమ కాలం నాటి అలవాటో గానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హస్తం పార్టీ
నేతలను పూచికపుల్లలతో సమానంగా చూసేవారు. ఎంత మాట అనేందుకైనా వెనుకాడేవారు కాదు. వారిని తిరిగి అనే పరిస్థితిలో కూడా కాంగ్రెస్
ఉండేది కాదు. కానీ, కాలం గిర్రున తిరిగింది. వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఆత్మరక్షణలో పడితే.. పవర్ చేతికి
రావడంతో కాంగ్రెస్ కు ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్లయింది. దీంతో గులాబీ నేతల చేతిలో ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకోవాలనే కసితో
ఉన్నారు. అయితే తామే ముందుగా మాట్లాడకుండా.. బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన సందర్భాలను ఉపయోగించుకొని తమదైన శైలిలో
విరుచుకుపడాలని వ్యూహాత్మకంగా ఎదురుచూస్తున్నారు. వీరి ఆలోచనకు తగినట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు కూడా ఆ అవకాశం కల్పిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రులు కౌంటర్
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను విశ్లేషించే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీశ్ రావు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
దీంతో వారి వైపు నుంచి ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలు.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రతివిమర్శలు సంధిస్తున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ కన్నా మరిన్ని రెట్లు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పులి అని, త్వరలోనే బయటికి వస్తుందని కేటీఆర్ తమ పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించగా.. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో దీనికి కౌంటర్ ఇచ్చారు.
పులిని బంధించేందుకు బోను సిద్ధం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ను వంద అడుగుల లోతు పాతిపెడతామని హెచ్చరించారు. దీంతో డైలాగ్ వార్ మరింత తీవ్రరూపం దాల్చింది.
బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా.. మంత్రులు కూడా దీటైన కౌంటర్ ఇస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు, పొన్నం ప్రభాకర్ వర్సెస్ నిరంజన్ రెడ్డి, కొండా సురేఖ వర్పస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఇలా సాగుతోంది.
అధికారంలో ఉన్నామన్న జోష్ లో కాంగ్రెస్ నేతలు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నామని అనుకుంటున్నారు.
అందుకే మాటల్లో దూకుడు తగ్గలేదు. కాంగ్రెస్ వైపునుంచి వచ్చే రియాక్షన్ ను ఎదుర్కొనాల్సి వస్తోంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నెలకొల్పే ప్రయత్నంలోనే తమ అగ్రనేతలు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నరని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
అయితే ఈ డైలాగ్ వార్ ఎంతదూరం దారితీస్తుందోనన్న ఆందోళన రెండు పార్టీల శ్రేణల్లో కనిపిస్తోంది
Also Read : కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వారిదే?
