Khammam :
ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న వెంకటేశ్ కూతురు ఆశ్రిత
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు, సినీరంగానికి ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉంది.
పలువురు సినీ తారలు, నిర్మాతలు, దర్శకులు రాజకీయాల్లో రాణించారు. కొందరికి రాజకీయ నేతలతో బంధుత్వం ఉంది.
తెలంగాణకు చెందిన రాజకీయ నేతల్లో.. హీరో రాంచరణ్ భార్య ఉపాసనకు బాబాయి (పిన్ని భర్త) అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓసారి ఎంపీగా పనిచేసి, ఇప్పుడు మరోసారి చేవెళ్ల నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది.
తాజాగా ఈ జాబితాలో హీరో వెంకటేశ్ కూడా చేరారు. అవును.. ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రామసహాయం రఘురామరెడ్డి స్వయానా హీరో వెంకటేశ్ కు వియ్యంకుడు.
వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను రఘురామరెడ్డి పెద్దకుమారుడు వినాయక్ రెడ్డి వివాహమాడారు.
ఇక రఘురామరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో వివాహం జరిగింది.
ఇలా.. రఘురామరెడ్డి అటు వెంకటేశ్ కు, ఇటు మంత్రి పొంగులేటికి వియ్యంకుడు. కాగా, వియ్యంకుడి గెలుపు కోసం హీరో వెంకటేష్ ప్రచార రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
మే 7న ఖమ్మంలో వెంకటేష్‌తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అటు కాంగ్రెస్, ‘వెంకీ మామ’ అభిమానుల్లో కోలాహలం మొదలైంది.
కేవలం ఖమ్మం పార్లమెంట్ వరకు మాత్రమే వెంకీ ప్రచారం ఉంటుందని సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం రఘురాం రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అయితే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం, అదే సామాజికవర్గానికి చెందిన వెంకటేశ్ ప్రచారానికి రానుండడం రఘురామరెడ్డికి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వెంకటేశ్ కూతురు, రఘురామరెడ్డి కోడలు ఆశ్రిత.. ఇప్పటికే తన మామయ్య తరఫున ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు.
మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, రఘురామరెడ్డిని గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు.
Also Read This Article : కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు
