Jagan Telangana Assembly
ఆయన ఇక్కడి నాయకుడు కాదు.. అసలు ఈ ప్రాంతంపై ఆయనకు ఆశలే లేవు.. పొరుగు రాష్ట్రంలో తన పనేదో తాను చేసుకెళ్తున్నారు. కానీ, ఆయన పేరు మాత్రం ఏకంగా అసెంబ్లీలోనే మార్మోగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి సైతం ఆయన పేరు వినిపిస్తోంది. ఏకంగా ఆయన ప్రసంగమూ ప్రసారమైంది.. ఇదేంటి..? సభలో లేని.. ఎక్కడో ఉన్న నాయకుడి పేరు ఇంతగా చర్చనీయాంశం ఎందుకవుతోంది..?
నిప్పు రాజేసిన నీళ్లు
ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రాజకీయమంతా మారిపోయింది. సరిగ్గా ఎన్నికల సమయంలోనే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగడం.. అదే కాళేశ్వరం అంశం ఇపుడు తెలంగాణ అసెంబ్లీలో చర్చకు రావడం గమనార్హం.
ఈ మధ్యలో క్రిష్ణా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకొందంటూ విపక్ష బీఆర్ఎస్ ఆరోపించడం.. వీటన్నిటి నేపథ్యంలో నీళ్ల వివాదం నిప్పు రాజేసింది.
దీనికిముందు. సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముంగిట నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పంపడం మరో పాయింట్. ఇలా అనేక మలుపులు తిరుగుతున్న నీటి జగడం.. అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ వరకు వెళ్లింది.
ఇందులో నీటి విషయమై ఏపీ సీఎం జగన్ మాట్లాడిన మాటల క్లిప్పింగ్ ను ప్రదర్శించింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు సైతం జలాల విషయంలో ఏపీ సర్కారు చర్యలు, ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రస్తావన తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏకంగా నీటి కుండకు కిందనే రంధ్రం పెట్టారంటూ ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ గోదావరి, బీఆర్ఎస్ క్రిష్ణా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా.. అటు ఏపీలో ఎన్నికలున్నాయి. ఆపై లోక్ సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నీటి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసలు తెలంగాణ ఉద్యమ మూలమే ‘నీరు’.
ఇలాంటి సమయంలో అధికార, ప్రతిపక్షాలు ఎలా ఉపేక్షిస్తాయి…? మరోవైపు క్రిష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఏకంగా నల్లగొండలో సభ నిర్వహించింది. ఇదే సమయంలో గోదావరి నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం పర్యటన చేపట్టింది ప్రభుత్వం.
జగన్ కే దీనితో లాభం?
సరిగ్గా రెండు నెలల్లో ఏపీలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలున్నాయి. తాను చేపట్టిన సంక్షేమ పథకాలే ఆయుధంగా టీడీపీ-జనసేన కూటమిని ఎదుర్కొంటున్నారు సీఎం జగన్.
ఇలాంటి సమయంలో జగన్ తెలంగాణ జలాలను తోడుకుని పోయారంటూ పదేపదే ప్రస్తావించడం ఆయనకే మేలు చేసేదిగా కనిపిస్తోంది. ఎగువన ఉన్న తెలంగాణను ఏమార్చి ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్న నాయకుడిగా ఆయనకు పేరు తెచ్చే చాన్సుంది.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…