చిత్రం: లెవెన్
విడుదల: 16-05-2025
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రవి వర్మ, కిరీటి తదితరులు
రచన, దర్శకత్వం: లోకేశ్ అజిల్స్
నిర్మాణం: అజ్‌మల్ ఖాన్, రేయా హరి
మ్యూజిక్ డైరెక్టర్: ఇమ్రాన్
ఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి
డీఓపీ: కార్తీక్ అశోకన్
ఇటీవలి కాలంలో నవీన్ చంద్ర ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో.. విలన్ పాత్రలోనో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత హీరోగా మారి చేసిన సినిమాయే ‘లెవన్’. ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఈ చిత్రంలో నవీన్ చంద్ర నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అనేసరికి సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. అందునా సినిమా తమిళ్‌లో చూసిన వారు అద్భుతంగా ఉందన్నారంటూ నవీన్ చంద్ర ఫుల్ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? నవీన్ చంద్రను హీరోగా నిలబెట్టిందా? చూద్దాం.
సమాజం బాధ పెట్టిన వారిని క్షమించమంటుంది.. బాధపడిన వారిని మరిచిపొమ్మంటుంది. కానీ ఏదో కొంచెం బాధ పెడితే ఓకే అని వదిలేయవచ్చు. కానీ జీవితానికి సరిపడా నరకాన్ని ఒక వ్యక్తికి కొందరు వ్యక్తులు చూపించారంటే ఆ బాధను మరచిపోగలరా? ఆ వ్యక్తులను క్షమించి వదిలేయడం సాధ్యమేనా? ఇదే అంశంతో ఈ సినిమా రూపొందింది. ఓ పసి మనసుకు అయిన భరించలేని గాయం వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. మరి ఆ గాయానికి అతను మందు ఎలా వేశాడు? చివరికి అతని కథ ఏమైందనేదే సినిమా కథాంశం.
సినిమా కథేంటి? ఎలా ఉంది?
వైజాగ్‌లో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ కేసులను చూస్తున్న ఏసీపీ రంజిత్ కుమార్ (శశాంక్)కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్లేస్‌లోకి ఈ కేసులను డీల్ చేసేందుకు వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన అరవింద్ (నవీన్ చంద్ర) అపాయింట్ అవుతాడు. అక్కడి నుంచి రంగంలోకి దిగిన అరవింద్ చకచకా కేసును డీల్ చేస్తూ మొత్తానికి ఒక కంక్లూజన్ అయితే ఇస్తాడు. ఆ తరువాత నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మర్డర్స్ చుట్టూనే తిరిగిన కథ.. ఇంటర్వెల్ టైమ్‌కి కొంత క్లారిటీ అయితే ఇస్తుంది. ఆ తరువాత సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే మనకు మర్డర్స్ ఎవరు చేస్తున్నారనే విషయమై క్లారిటీ వస్తుంది కానీ కొన్ని ట్విస్ట్‌లు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. సినిమా ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సాధారణ సినిమా మాదిరిగానే కేవలం మర్డర్స్‌ను చూపిస్తూ మాత్రమే దర్శకుడు లోకేశ్ లాగించేశారు. ఆ తరువాత సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రస్టింగ్‌గానే మలిచాడు కానీ సినిమా అద్భుతం అనేలా మాత్రం లేదనే చెప్పాలి. ఒక థ్రిల్లర్ అంటే ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందకుండా ఉండాలి. కానీ ఒక ట్విస్ట్ విషయంలో మాత్రం లోకేశ్ ప్రేక్షకుడిని మాయ చేశాడు. అంతకు మించి సినిమా ఆసక్తికరంగా అనిపించదు. ట్రైలర్ చూసిన వారికెవరికైనా 8 మర్డర్లు జరిగితే టైటిల్ ‘లెవెన్’ అని పెట్టారేంటా? అన్న సందేహం కలుగుతుంది. కానీ సినిమా చూస్తే ఆ విషయంలో క్లారిటీ వస్తుంది.
ఎవరెలా చేశారంటే..
నవీన్ చంద్ర అయితే సర్వసాధారణంగానే అద్భుతంగా నటించాడు. గతంలోనూ పోలీసాఫీసర్ రోల్స్ చేసి ఉండటంతో ఈ సినిమాలోనూ తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ రేయాన్ హరి పాత్ర నిడివి అయితే చాలా తక్కువ. కానీ ఆమె నటన పర్వాలేదన్నట్టుగా ఉంది. ఏసీపీ రంజిత్ కుమార్‌గా శశాంక్, ఎస్సై మనోహర్‌గా దిలీపన్ తదితరులు చక్కగా నటించారు. రవివర్మ, కిరిటీ, ఆడుకాలం నరేన్ తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నా.. పాటలు ఏమాత్రం మెప్పించలేకపోయాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.
బోటమ్ లైన్: థ్రిల్లర్‌లను ఇష్టపడే వారినైతే సినిమా అంతగా మెప్పించదు.
రేటింగ్: 2.5/5
ప్రజావాణి చీదిరాల