India’s alliance is in danger:కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లుకు భూకంపం తోడైనట్లు, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న గడ్డివాముపై నిప్పు రవ్వ పడ్డట్టు ఇండియా కూటమి నుండి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని ఎదురుచూస్తున్న విపక్షాలకు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం, కర్పూరీకి భారతరత్న అంశాలు కలిసి వచ్చాయి.
బీహార్ కు చెందిన బీసీ నేత జన నాయకుడు కర్పూరికి భారతరత్న ప్రకటించిన రోజే మమతా బెనర్జీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో తాము పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. పంజాబ్ లో మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం 13కు 13 లోక్ సభ స్థానాలు తామే గెలుస్తామని ప్రకటించి, పరోక్షంగా కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని చెప్పింది.
ఇక, ఇండియా కూటమి రూపకర్తల్లో ఒకరైన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కాంగ్రెస్ పైన విమర్శలు మొదలుపెట్టారు. కర్పూరికి భారతరత్నను ఈ సందర్భంగా తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి వెళ్లడానికే కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వారం రోజుల్లో గా కాంగ్రెస్, ఆర్జేడీని వీడి బిజెపి మద్దతుతో నితీష్ మళ్ళీ సీఎం గా తిరిగి ప్రమాణం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నితీశ్ టర్నింగ్
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, దాన్ని గద్దె దించడానికి విపక్షాలంత ఏకం కావాలని నితీష్ పిలుపునిచ్చారు.
దేశమంతా పర్యటించి విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పడింది.
అయితే కూటమికి తననే కన్వీనర్ గా ప్రకటిస్తారని, కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా తన పేరునే ప్రతిపాదిస్తారని నితీష్ భావించారు.
అయితే కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆయన కొంత అలక వహించారు. తాజాగా రామాలయం ప్రారంభోత్సవంతో దేశమంతా మళ్లీ మోడీ పేరు వినిపిస్తుండడంతో కూటమి అధికారంలోకి రాదని భావించిన నితీష్ తిరిగి ఎన్డీఏలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మమత కినుక..
పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మధ్యలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు అమిత ప్రాధాన్యం ఇస్తుందని మమత మొదటి నుంచి ఆగ్రహంగా ఉన్నారు.
అంతేకాకుండా సీట్ల కేటాయింపు విషయంలో కూడా రెండు పార్టీల మధ్యలో విభేదాలు వచ్చాయి.
బెంగాల్లో కాంగ్రెస్ కి బలం లేదని, ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లో పోటీ చేస్తే చాలని, మిగతా స్థానాల్లో స్థానికంగా బలంగా ఉన్న తమను పోటీ
చేయనివ్వాలని మమత ప్రతిపాదించారు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది.
అప్ మొదటి నుంచే దూరం దూరం…
ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో చేరడమే అత్యంత నాటికీయ పరిస్థితుల్లో జరిగింది.
ఢిల్లీ అధికారాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తేనే తాము ఇండియా కుటుంబంలో చేరుతానని కేజ్రీవాల్ మంకు పట్టుపట్టారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ అందుకు అంగీకరించాల్సి వచ్చింది.
అయితే ఆప్ కూటమిలో చేరినప్పటికీ పంజాబ్లో మాత్రం స్థానిక కాంగ్రెస్, ఆప్ నేతలు ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
అక్కడ ఒంటరిగానే పోటీ పడతామని రెండు పార్టీల నాయకులు తమ తమ అధిష్ఠానాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.
తాజాగా మాన్ ప్రకటనతో పంజాబ్ లో కూటమి తరఫున కాకుండా ఆప్, కాంగ్రెస్ ముఖాముఖి తలపడతాయని తేలిపోయింది.
ఐదు రాష్ట్రాల ఫలితాలతో మారిన సమీకరణాలు..
నిజానికి భారత్ జోడో యాత్రతో రాహుల్ పరపతి బాగా పెరిగింది. ఆ యాత్రతో మోడీని ఢీకొట్ట గల నేతగా రాహుల్ కొంచెం కనిపించారు.
ఆయన వాగ్దాటి పెరిగింది. దీనికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలపడుతూ ఉందన్న సంకేతాలను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కూటమిలోని విపక్షాలు కాంగ్రెస్ ముందు తమ డిమాండ్లను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాయి.
అయితే, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఐదు రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, హిందీ బెల్ట్ లోని మూడు కీలక రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పూర్తిగా బలహీనమైపోయినట్లు కనిపించింది. దీంతో విపక్షాలు తమ స్వరాన్ని పెంచాయి. కాంగ్రెస్ బలంగా లేని చోట్ల స్థానిక పార్టీలకు అవకాశం ఇవ్వాలని, అప్పుడే మోడీని గద్దె దించడం సాధ్యమని అవి పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అందుకు సుముఖంగా లేకపోవడంతో కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి.
రామాలయం, బీసీ మంత్రం.. మోడీ పాచికలు
తాజాగా యోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంతో మోడీ పేరు దేశమంతా మార్మోగింది. ఈ ఊపులోనే ఎన్నికలు వెళ్లాలని కేంద్రంలోని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభోత్సవానికి రావాలన్న ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల కొంత వ్యతిరేకతను పెంచిందని అంచనా. రామాలయం విషయంలో విపక్షాలన్నీ అయోమయంలో పడ్డాయి. వెళ్తే బిజెపి ట్రాప్ లో పడినట్లే అని భావించి స్థానికంగా ఆలయాల్లో పూజ కార్యక్రమాల్లో విపక్షాల సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే అయోధ్య ముందు ఇవేవీ ప్రజలకు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమిలో ఉండి అధికారాన్ని పోగొట్టుకోవడం కంటే సొంతంగా పోటీ చేసి కొన్ని స్థానాల్లో అయినా విజయం సాధించడం మంచిదని రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో బిజెపి ప్రభుత్వం బీహార్ బీసీ నేత కర్పూరీకి భారత రత్నను ప్రకటించింది. దీంతో బీహార్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మోదీ బీసీ మంత్రం మరోసారి హిందీ బెల్ట్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా.