Secunderabad Lok Sabha :
సికింద్రాబాద్ లో గెలవకపోతే భవిష్యత్తు సంక్షోభమే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ సిటింగ్ ఎంపీగా ఈసారి ఎన్నికల బరిలో నిలవడం ఆయనకు అగ్నిపరీక్ష కానుంది. దేశమంతా ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి మరోసారి అనుకూల పవనాలు వీస్తున్న వేళ.. తాను ఎంపీగా మళ్లీ గెలిస్తే.. తిరిగి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కిషన్ రెడ్డి ఉంటాయి.కానీ, ఒకవేళ సికింద్రాబాద్ లో ఓటమిపాలైతే మాత్రం రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడమే ఈ సందేహాలకు కారణం.
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేటలో పరాజయం పాలు కావడమే గతంలో కిషన్ రెడ్డికి కలిసివచ్చిన అంశంగా చెబుతుంటారు. నాటి సికింద్రాబాద్ సిటింగ్ ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా మోదీ సర్కారు పంపించడంతో ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది.
ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం, బీఆర్ఎస్ తరఫున రాజకీయాలకు కొత్త అయిన అభ్యర్థి (మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్)ని నిలపడంతో కిషన్ రెడ్డి గెలుపు సునాయాసమైంది.దానికితోడు తెలంగాణ నుంచి సీనియర్ నేతగా, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ, ఈసారి పరిస్థితులు గతానికి పూర్తి భిన్నంగా మారడంతో కిషన్ రెడ్డి గెలుపు కోసం చెమటోడ్చాల్సిన అవసరం ఏర్పడింది.
అందరి దృష్టి సికింద్రాబాద్ నియోజకవర్గం వైపే
నిజానికి తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నా.. వీటిలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న నియోజకవర్గం సికింద్రాబాదే. కిషన్ రెడ్డికి పోటీగా ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తుండగా.. బీఆర్‌ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పోటీకి దిగుతున్నారు.పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇటీవల దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇలా రెండు పార్టీల తరఫున ఇద్దరూ ఎమ్మెల్యేలే ఎంపీ బరొలో నిలిచారు.కాగా, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న పద్మారావు గౌడ్ కు ప్రజల్లో మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు విధేయుడిగా ఉన్నారు. ఆయనపై ఎలాంటి ఆరోపణలూ లేవు. పైగా లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు అధిక సంఖ్యలో ఉండడం బీసీ అయిన పద్మారావుకు కలిసివస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
మరోవైపు దానం నాగేందర్ కూడా బీసీ సామాజికవర్గానికి (మున్నూరుకాపు) చెందిన వ్యక్తే కావడం, నియోజకవర్గంలోనే కాకుండా.. హైదరాబాద్ నగరంలో బలమైన, గట్టిపట్టున్న నేతగా గుర్తింపు ఉండడంతో ఆయనను ఎదుర్కోవడం కూడా అంత తేలిక కాదన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల నుంచి కిషన్ రెడ్డికి సవాలు తప్పదని స్పష్టమవుతోంది. మరి దీనిని ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారో, గెలుపు తీరాలకు ఎలా చేరుతారో చూడాల్సి ఉంది.
ఉప ఎన్నిక వస్తుందా?
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో వచ్చే ఫలితం.. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికను నిర్దేశించేది కాబోతోంది. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిస్తే.. దానం నాగేందర్, పద్మారావు గౌడ్ లకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. వారు ఎలాగూ ఎమ్మెల్యేలుగా ఉన్నందున తరువాత కూడా ఆ పదవుల్లో కొనసాగుతారు. కానీ, వీరిలో ఎవరు గెలిచినా ఎమ్మెల్యేస్థానానికి ఉప ఎన్నిక వస్తుంది.