ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయితే ఇండస్ట్రీ నుంచి నిషేధం..

తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అంతా కృషి చేయాలని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, సినీ నిర్మాత దిల్‌రాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధరణ అయితే, ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేలా ఇటీవల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే తెలంగాణ ఎఫ్‌డీసీ (ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), తెలుగు చిత్ర పరిశ్రమ సైతం ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వారిని ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిషేధించాలి. చిత్ర పరిశ్రమ పెద్దలతో మాట్లాడి ఈ నియమాన్ని అమలు చేసేలా చేస్తామని దిల్ రాజు తెలిపారు.

అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో కొన్ని స్కూల్స్‌ బయట డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసి బాధేసిందని.. అయితే అప్పుడు తాను తండ్రిని కాదని.. ఇప్పుడు తానూ ఒక తండ్రినని పేర్కొన్నాడు. రోజూ వ్యాయామం చేస్తూ.. అలాగే నచ్చిన పని చేసుకుంటూ, కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలని సూచించాడు. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్‌, సమాజం బాగుచేసుకుందామన్నాడు. ఈ విషయంలో పోలీస్‌ శాఖ కృషిని ప్రశంసిస్తున్నానని తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారి డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. తానొక చిన్న ప్రపంచంలో బతుకుతానని.. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదన్నాడు. తాను విశాఖ పోర్ట్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు యాంటీ డ్రగ్‌ క్యాంపెయిన్‌ గురించి బైట్‌ ఇవ్వమని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ అడిగితే.. గౌరవం కొద్దీ ఇచ్చానన్నాడు. కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్‌ డే ఉందని తెలిసిన తర్వాత కొంతమంది పోలీస్‌ ఆఫీసర్‌లను కలిశానని… వారు చెప్పిన విషయాలు విన్నాక దీనిపై కచ్చితంగా దీనిపై మాట్లాడాలనిపించిందన్నాడు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదని.. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *