కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న విడుదల కానుంది. త్రిష, శింబు, అభిరామి ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు (గురువారం) మేకర్స్ మీడియా మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఒక దర్శకుడిగా మణిరత్నం గారు నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశారో.. ‘థగ్ లైఫ్’తో కూడా అంతే సర్ప్రైజ్ చేయబోతున్నారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చడం సరికాదు. నేనింకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే మన ముందు నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి. నేను మణిరత్నం గారి సినిమాలో యాక్ట్ చేయను, జస్ట్ బిహేవ్ చేస్తాను. చైల్డ్ హుడ్ నుంచి శింబు సినిమాలు చూస్తున్నా. అది నా చైల్డ్‌హుడ్ కాదు.. తన చైల్డ్ హుడ్ నుంచి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్టింగ్ జర్నీ ప్రారంభించాడు. నన్ను స్టార్‌ని చేసింది తెలుగు పరిశ్రమ. అందుకే నాకు తెలుగు పుట్టిల్లు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే నా శక్తి వంచన లేకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘కమల్ హాసన్ గారితో తొలిసారి ‘నాయకుడు’ సినిమా చేశాను. ‘మౌనరాగం’ సినిమా పూర్తయిన తర్వాత ఇంట్లో కూర్చుని ఉన్నాను. నిర్మాత ముక్తా శ్రీనివాసన్ గారు వచ్చి ఒక క్యాసెట్ చేతిలో పెట్టారు. అది ఒక హిందీ సినిమా. ఆ సినిమాని తమిళ్లో చేయాలని చెప్పారు. నాకు రీమేక్ చేసే ఉద్దేశం లేదు. అయితే ఇదే మాట కమలహాసన్ గారితో చెప్పమన్నారు. నేను వెళ్లి ఆయనకు అదే చెప్పాను. అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ సినిమా చేద్దామన్న అని చెప్పారు. అలా ‘నాయకుడు’ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలానే జరిగింది. కాల్ చేసి ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు
సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడికి వస్తే ఒక పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ద బెస్ట్ టాలెంట్ కలిసి ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల మీద చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమాలో అందరూ అదరగొట్టేసారు. ఈ సినిమా కోసం మీలానే జూన్ ఫిఫ్త్ కోసం ఒక ఆడియన్ లాగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ… ‘‘నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ జర్నీ. నేను నాయకుడు సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు మణిరత్నం గారు కమలహాసన్ గారితో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
అభిరామి మాట్లాడుతూ… ‘‘ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ వేరే లెవల్. మీ ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం గారు కమల్ హాసన్ గారు ఏఆర్ రెహమాన్ గారు, శింబు గారు ఇలాంటి లెజెండ్స్ తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి వచ్చిన ఫీలింగ్ ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాజర్, తనికెళ్ల భరణి, అశోక్ సెల్వన్, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణి చీదిరాల