Hero Rupesh: నిర్మించడం కన్నా నటించడాన్ని ఎంజాయ్ చేశా..

ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమాలో నిర్మాత, హీరోగా రూపేశ్ నటించగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటించింది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో, నిర్మాత రూపేశ్ మీడియాతో ముచ్చటించారు. ‘‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలే రావడం లేదు. విలువలతో స్క్రిప్ట్ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నిర్మించడం కన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ‘షష్టిపూర్తి’ పూర్తిగా కల్పిత చిత్రం.. కానీ ఇందులోని పాత్రలకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మా సినిమాలో కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం. ‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ కథ రాసుకున్నారు.

అయితే ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే బాగుంటుందని ఆయన భావించారు. అందుకే కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూశారు. చివరకు నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఇళయరాజా గారి మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించడమే కాకుండా ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. కీరవాణి గారు అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు. ఈ సినిమాలోని పాటలు, ఆర్ఆర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ‘షష్టిపూర్తి’ కథ విన్న తరువాత ఇలాంటి పెద్ద టీం ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. అందుకే పెద్ద పెద్ద టెక్నీషియన్ల కోసం ట్రై చేశాం. బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అయింది. ‘షష్టిపూర్తి’ కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. నాకు అయితే ఎమోషనల్ సీన్స్ చేయడం సులభం అనిపిస్తుంది. అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ‘షష్టిపూర్తి’ కథ వినే పెద్ద టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

మా ఆయి ప్రొడక్షన్స్ అంటే.. మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. అమ్మ జ్ఞాపకార్థంగానే అలా పెట్టుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, ఇళయరాజా గారైనా సరే ఏదైనా ఒక పని చేస్తే వంద శాతం ఫోకస్డ్‌గా ఉంటారు. అందుకే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారు. ‘షష్టిపూర్తి’ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీ రాలేదు. ఆకాంక్ష చక్కగా నటించారు. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కమర్షియల్ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు. కథకు తగ్గట్టుగా ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం, పాటలు అందించారు. యువన్ శంకర్ రాజా గారు పాడిన ఎరోటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. నాన్ థియేట్రికల్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ స్పందనను చూసిన తర్వాతే ఓవర్సీస్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. మౌత్ టాక్‌తోనే ఈ మూవీ ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *