Hyderabad : కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు

Hyderabad :

బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేయడంతో జారీ

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

ఈ నోటీసుల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల‌పై అనర్హత వేయాలంటూ మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ క్రమంలో వారిద్దరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది నవంబర్ చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.

అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

కానీ తాను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబడడం లేదంటూ.. అందుకు కారణాలు వివరిస్తూ.. కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు.

అనంతరం కడియం శ్రీహరితోపాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇక వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.

మరోవైపు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ పార్టీ కి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ నేపథ్యంలో ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడంతో.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో… అంటే 2014 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పెద్దసంఖ్యలో తన పార్టీలో చేర్చుకోవడం తెలిసిందే.

 

Also Read This Article : రేవంత్ ను అరెస్టు చేస్తారా?

 

Hyper Aadi Exclusive Interview
Hyper Aadi Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *