Hyderabad :
రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు హరీశ్ రావు.
తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుపై సవాళ్లు, ప్రతిసవాళ్ల వ్యవహారం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించడం, దాంతో హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడం తెలిసిందే.
అయితే సీఎం రేవంత్ చేసిన ప్రతి సవాల్ కు హరీశ్ రావు స్పందించారు. శుక్రవారం హరీశ్ రావు తన రాజీనామా గన్ పార్కు వద్దకు చేరుకున్నారు.
ఆగస్ట్ 15లోగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు.
తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. అంతేకాదు.. స్పీకర్ ఫార్మాట్లోనూ రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టుల చేతుల్లో పెడుతున్నానని చెప్పారు.
రేవంత్ హామీలను అమలు చేస్తే నా లేఖను వాళ్లు స్పీకర్‌కు ఇస్తారన్నారు. హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘‘కాంగ్రెస్ హామీలు నిజమైతే, రేవంత్ భేషజం వల్ల గన్ పార్కుకు రావడానికి ఇష్టం లేకపోతే ఆయన పీఏ ద్వారా లేకపోతే సిబ్బంది ద్వారా పంపాలి’’ అని హరీశ్ రావు అన్నారు.
స్థూపం వద్ద పూలు పెట్టడానికి ఆయనకు ఇష్టం లేకపోవచ్చని రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నానని అన్నారు.. ఆయన రాజీనామా ఇస్తారో ఇవ్వరో ఆయన విజ్ఞతకు వదిలిలేస్తున్నాను.
రేవంత్ రాజీనామా పత్రాన్ని ఇవ్వకపోతే దేవుళ్ల పేర్ల మీద మళ్లీ మోసం చేస్తారని భావించాల్సి ఉంటుందన్నారు.
హరీష్ రావుపై రేవంత్ ఆగ్రహం…
గన్‌పార్క్ వద్ద హరీష్ రావు చేసిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందన్నారు.
హరీష్ మోసానికి ముసుగుగా అమరవీరుల స్థూపం మారిందన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు.
చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నాడని, రాజీనామా లేఖ అలా ఉండదన్నారు.
హరీష్‌రావు మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని, స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదన్నారు.
హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని, హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందన్నారు. హరీష్ రావు సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామని చెప్పారు.
పంద్రాగస్టులోగా తెలంగాణలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాజీనామా రెడీగా పెట్టుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా.. హరీశ్ రావు అమర వీరుల స్తూపం వద్దకు వచ్చి వెళ్లాక కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి స్తూపాన్ని పుసుపు నీళ్లతో శుద్ది చేశారు.
అమరవీరుల చావుకు కారణమైన హంతకుడు హరీశ్ రావు అని ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ సందర్భొంగా ఆరోపించారు.
ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టన పెట్టుకున్న వ్యక్తి హరీశ్ రావు అని అన్నారు.
అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం వల్ల ఈ ప్రాంతం మైల పడిందిని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని చెప్పారు.
పదేళ్లుగా హరీష్ రావుకు గానీ, ఇతర బీఆర్ఎస్ నాయకులకు గానీ ఏనాడు కూడా అమరవీరులు గుర్తుకు రాలేదని విమర్శించారు.
ఇప్పుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ స్థూపాన్ని వాడుకుంటోన్నారని మండిపడ్డారు.
Also Read This Article : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ పేరును చేర్చింది జగనే?