ప్రొడ్యూసర్ కేఎస్ గారికి సూటి ప్రశ్న.. కక్కుర్తి పడకుండా ఎన్నిసార్లు థియేటర్లకొచ్చారు?

‘అభిలాష’ చిత్రంతో 1983లో తన సినీ ప్రస్థానాన్ని ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు మొదలు పెట్టారు. ఆ తరువాత కూడా అన్నీ హిట్సే.. ‘ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్, చంటి’ వరుసబెట్టి ఇన్ని హిట్స్ కొట్టడం దాదాపు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇన్ని హిట్స్ కొట్టిన కేఎస్ రామారావు.. తాజాగా ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ప్రేక్షకులను పదే పదే కక్కుర్తి గాళ్లుగా అభివర్ణించడం ఎవరికీ మింగుడు పడని విషయం. మీ సినిమాలను పెద్ద హిట్ చేస్తే ప్రేక్షక దేవుళ్లా? థియేటర్‌లకు రాకుంటే కక్కుర్తి గాళ్లా.. అదెలా? దేవుడు ఎప్పుడైనా దేవుడే కదా.. కక్కుర్తిగాడు ఎలా అవుతాడు? అంతుబట్టలేదు.

సినిమాను నిలబెట్టినా.. కూలదోసినా వారే..

ఇవాళ, రేపు చిన్న సినిమా లేదు.. పెద్ద సినిమా లేదు. సినిమాలో సత్తా ఉంటే ప్రేక్షకుడు థియేటర్ మెట్లు ఎక్కుతాడు. లేదంటే అటు వైపు కూడా తిరిగి చూడడు. ఒకప్పుడంటే సినిమా ఒక్కటే ఎంటర్‌టైన్మెంట్ సాధనం.. కానీ నేడు ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబం సినిమాకు పెట్టే ఖర్చుతో రోజంతా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అదీకాకుండా హోమ్ థియేటర్స్ వచ్చేశాయి. నెల తిరిగే సరికి ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది. ఇంట్లోనే కుటుంబమంతా కూర్చొని.. కావల్సినవి తింటూ ఏసీలో సినిమా చూస్తారు. బొమ్మ పడగానే ముందుగా థియేటర్లకు వచ్చేవారు కొందరుంటారు. వారు సినిమా చూసిన తర్వాత ఇచ్చే మౌత్ టాకే సినిమాను నిలబెట్టినా.. కూలదోసినా. మౌత్ టాక్ అద్భుతం అని వచ్చిందా? ఫ్యామిలీస్ అన్నీ థియేటర్లకు తరలి వస్తాయి. లేదా.. లైట్ తీసుకుంటాయి. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా కేవలం సినిమాకే ఉంటుంది. దానిలో సత్తా లేకుంటే ఏం చేయలేం.

థియేటర్ యాజమాన్యాల అత్యాశను ఏనాడైనా ప్రశ్నించారా?

గురివింద తన నలుపెరగదన్న చందంగా సినిమాకు మీరు ప్రేక్షకులను రప్పించుకునేలా తీయడం మానేసి వారిని కక్కుర్తిగాళ్లను చేయడమెందుకు? అప్పట్లో వరుస హిట్స్ కొట్టిన ఇదే కేఎస్ రామారావు.. ఆ తరువాతి కాలంలో వరుస ఫ్లాపులు కూడా అందుకున్నారు. అది కూడా ప్రజలకు సినిమాయే ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ సాధనంగా ఉన్న సమయంలో.. మరి ఇప్పుడు ఇన్ని ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ ఉండగా.. ఒక ఫ్లాప్ టాక్ ఉన్న సినిమాకు ఎందుకు వస్తారు? మూవీ అసోసియేషన్‌లో ఎన్నో పదవులు అనుభవించిన కేఎస్ రామారావు.. థియేటర్ యాజమాన్యాల అత్యాశను ఏనాడైనా ప్రశ్నించారా? ఇప్పుడు ప్రేక్షకులను కక్కుర్తిగాళ్లనడం విడ్డూరంగా ఉంది. అసలు అంతెందుకు ఇన్ని సినిమాలు తీసిన ఆయన.. వారానికి కనీసం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి కదా.. తన సినిమాలు తప్ప తను చూసిన సినిమాలెన్ని? కుటుంబ సమేతంగా ఎన్ని సినిమాలు చూసుంటారు? తన సినిమాలు కాకుండా వేరొకరి సినిమాలను సగటు ప్రేక్షకుడు చూసిన మాదిరిగా కూడా చూసి ఉండరు. మరి ఆయన్ను ఏమనాలి?

ఆడ లేక మద్దెల మీద ఆరోపణలా?

ఇదంతా పక్కనబెడితే ఓటీటీ సంస్థలకు సినిమాలను అమ్ముతున్నదెవరు? సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇంతా.. అంతా.. అంటూ ప్రచారం చేసుకునేదెవరు? అప్పుడేమో థియేటర్‌లో సినిమా ఆడకున్నా.. ఓటీటీలో ఆడుతుందన్న ధీమా. విడుదలకు ముందే సినిమాకు పెట్టిన బడ్జెట్‌ను దాదాపుగా లాగేయాలన్న తాపత్రయం. చేస్తున్నదంతా మీరు చేసి.. ప్రేక్షకులను కక్కుర్తిగాళ్లంటే ఎలా? ఏదైనా ఈవెంట్‌కు వెళితే ఊకదంపుడు ఉపన్యాసాలాపి.. సినిమాకు పనికొచ్చే మెసేజ్‌లు ఇవ్వండి. అంతేకానీ ఆడలేక మద్దెల మీద ఆరోపణలు చేయకండి. పెదవి దాటిన మాటకు ఎవరైనా బానిసే రామారావు గారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుందేమో చూసుకోండి.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *