...

‘రెట్రో’, ‘రైడ్ 2’ మధ్యలో ‘హిట్ 3’.. ఎవరెంత సౌండ్ చేస్తారో..

ముక్కోణపు పోటీ అత్యంత ఆసక్తికరం. సంక్రాంతి సమయంలోనో.. దసరా సమయంలోనో ఇలాంటి పోటీని మనం చూడగలం. అయితే ఇప్పుడు వేసవి కానుకగా ముక్కోణపు సిరీస్ సినీ పరిశ్రమలో జరగబోతోంది. మే 1న‌ జరుగనున్న ఈ సిరీస్‌లో గెలిచి నిలిచేదెవరో. ముగ్గురూ టాలీవుడ్ స్టార్ హీరోలైతే పోటీ మరింత రంజుగా ఉంటుంది. సినిమాల విషయంలో ఆ ఉడ్, ఈ ఉడ్ అంటూ వేరు చేయడం సరికాదు కాబట్టి ముగ్గురికి ముగ్గురూ స్టార్ హీరోలే. ఎవరినీ తీయడానికి లేదు.. ఎవరినీ వంక పెట్టడానికీ లేదు. ఒకరేమో ‘రెట్రో’గా వస్తుంటే.. మరొకరు ‘రైడ్ 2’.. ఇంకొకరు ‘హిట్ 3’. మొత్తానికి ఆసక్తికర ఫైట్. నెగ్గేదెవరో.. తగ్గేదేవరో అంటే సూర్య, అజయ్ దేవగణ్ చిత్రాల గురించి అయితే తెలియదు కానీ నాని ‘హిట్ 3’తో తలపడటం అంటే మాటలు కాదు. అసలే అర్జున్ సర్కార్ ఇక్కడ.. లాఠీ పడితే అంతే సంగతులు.

దుమ్మురేపుతున్న అప్‌డేట్స్

ఎందుకోగానీ మన దగ్గర ‘రెట్రో’ ప్రచారం పెద్దగా లేదు. అందుకే మనకు అంతలా తెలియడం లేదు కానీ సూర్య స్టార్‌డమ్ మామూలుది కాదు. తమిళనాడులో ఈ మూవీ హీట్ బీభత్సంగానే ఉంది. సూర్య క్రేజ్ అక్కడ మామూలుగా ఉండదు. పైగా ‘కంగువా’ మూవీ ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు. దీంతో ‘రెట్రో’ విషయంలో సూర్య చాలా జాగ్రత్తలు వహించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కానీ ప్రేక్షకులకు నచ్చిందో తమిళనాటే కాదు.. టాలీవుడ్‌లోనూ దుమ్మురేపుతుంది. ఇప్పటికే విడుదలైన అన్నీ అప్‌డేట్స్ నెట్టింట దుమ్మురేపుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం మే 1 బరిలో నిలవనుంది.

నెట్టింట సెన్సేషన్..

ఇకపోతే అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రైడ్‌ 2’. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రాజ్‌ కుమార్‌ గుప్తా దీనిని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. పైగా 2018లో ‘రైడ్’ విడుదలై మంచి సక్సెస్ సాధించింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గానే ‘రైడ్ 2’ రూపొందింది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అజయ్ దేవగణ్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటించి మెప్పించనున్నారు. ఈ చిత్రం కూడా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది.

సూటిగా సుత్తి లేకుండా..

ఇక మన అర్జున్ సర్కార్.. అదేనండి నేచురల్ స్టార్ నాని.. ‘హిట్ 3’తో మే 1న వస్తున్నాడు. అసలే నాని గట్టోడే. ‘రైడ్ 2’ కూడా మీ సినిమా విడుదల రోజే వస్తోంది కదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆ సినిమాయే చూడండని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. మనోడికి తన సినిమా సక్సెస్‌పై అంత నమ్మకముంది. ఆయనకే కాదు.. ముందు రెండు సిరీస్‌లు చూసిన వారంతా కూడా ‘హిట్ 3’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ పరంగానూ నాని ముందు వరుసలోనే ఉన్నాడు. ఈ సినిమా కూడా మే 1న విడుదల కానుండంతో సినీప్రియులు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. మూడు సినిమాల్లో ఏది ఎక్కువ వసూళ్లు రాబడుతుంది? దేనికి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందనే చర్చ మొదలైపోయింది. ఇక చూడాలి.. ఎవరెంత సౌండ్ చేస్తారనేది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.