పసిడి చూడ ఆకర్షించుచుండు.. ముట్టుకొని చూడ ధర పేలిపోతుండు.. నిజమే ఎక్కడ బంగారం ధర..ఎక్కడికి చేరింది? అసలు ఇదెక్కడ ఆగుతుంది? కళ్లాలే లేకుండా పరుగులు తీస్తోంది. ఆది మాత్రమే కానీ అంతమనేది లేకుండా పోయింది. మధ్యతరగతి వర్గాలు తల పైకెత్తి చూసినా కనపడనంత ఎత్తుకి పసిడి ధర చేరిపోయింది. తులం బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. ఈ ఏడాది ఆరంభమై నాలుగు నెలలు కూడా పూర్తవలేదు కానీ బంగారం ధర 10 గ్రాములపై రూ.21 వేలు పెరిగింది. కాదేదీ బంగారం ధర పెరుగుదలకు అనర్హం అన్నట్టుగా అంతర్జాతీయ కారకాలు బంగారం ధరకు బూస్ట్ అయ్యాయి. ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం వంటివన్నీ కలిసి బంగారం ధరను ఆల్ టైం హైకి చేర్చేశాయి.
సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయానికి, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గరిష్టంగా రూ.1,00,016 పలికి షాకిచ్చింది. అంతలోనే కాస్త సర్దుకుని రూ.99,900 వద్ద ట్రేడ్ అయినా కూడా శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.2,000 అధికం కావడం విశేషం. ఒక్కసారి గత ఏడాది ఎండింగ్‌కు వెళితే 2024 డిసెంబర్ 31 నాటికి సుమారు రూ. 79,000 వద్ద తులం బంగారం ధర ఉంది. మధ్యతరగతి వర్గాలకు ఇది కూడా తక్కువేమీ కాదు. బంగారం కొనాలంటే ఇబ్బందికర పరిస్థితే. అలాంటిది కేవలం ఈ మూడున్నర నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 20,000 పైగా పెరగడమంటే మాటలు కాదు. బంగారం చరిత్రలోనే ఇంత త్వరితగతిన ఆల్ టైం హైకి చేరడమనేది దాదాపుగా ఇదే తొలిసారి అని చెప్పాలి. మొత్తానికి బంగారం పెట్టుబడిదారులకు మాత్రం ఈ పెరుగుదలతో కనకవర్షమే.
హైదరాబాద్‌లో ఇవాళ (22 ఏప్రిల్, మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,836, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,016, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.7,377గా ఉంది.