తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజాగా మరో హీరో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు హీరోగా సినిమా నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభమైంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ సినిమా ముహూర్తం షూట్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో జరిగింది. ప్రారంభోత్సవ వేడుకకు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా.. దగ్గుబాటి పురందేశ్వరి కెమరా స్విచాన్ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ.. ‘‘నాన్నగారు ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహా మనిషి. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన కుమారులు, మనవళ్లు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మునిమనవడు సైతం ఇండస్ట్రీలోకి వస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘‘నందమూరి కుటుంబం నుంచి మరో తరం తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కళాకారుడికి కళామతల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నతశిఖరాలు అధిరోహిస్తాడు. మా నాన్న ఒక కళాతపస్వీ. చలన చిత్ర రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారు. ఆయన తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ.. వారి తర్వాత తరం నందమూరి కల్యాణ్‌రామ్, నందమూరి తారకరామారావు కూడా అంకితభావంతో తమ ఉనికికి చాటుకున్నారు. వీరి తర్వాతి తరం.. మేమంతా రామ్ అని పిలుచుకునే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు’’ అని తెలిపారు.
నారా భువనేశ్వరి మాట్లాడుతూ… ‘‘నందమూరి తారక రామారావు.. అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారి లాగా కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నాలుగో తరం ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావడం సంతోషించిదగిన పరిణామం. రామ్ వంటి కసి ఉన్న వ్యక్తి కచ్చితంగా ఏం కోరుకుంటాడో ఆ స్థాయికి ఎదుగుతాడు. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’’ అన్నారు
నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను అస్త్ర సన్యాసం చేసి పాతికేళ్లయింది. నా చివరి చిత్రం ‘గొప్పింటి అల్లుడు’ తర్వాత పాతికెళ్లకు నా మనిమనవడి షాట్ తీసే భాగ్యం కలిగింది. నాన్నగారికి జానకీరామ్ చాలా ఇష్టమైన మనవడు. వీరిద్దరి మధ్య చాలా చనువు ఉండేది. నాన్నగారే జానకీరామ్ పెద్ద కుమారుడికి ఆప్యాయతతో నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు’’ అని పేర్కొన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ… ‘‘విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1 మొదలైంది. ఈ సినిమాలో కథానాయకుడు మా మనవడి కోసం దర్శకుడు వైవీఎస్ చౌదరి అద్భుతమైన కథని సిద్ధం చేశారు’’ అని తెలిపారు.
నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకేశ్వరి గారు, భువనేశ్వరి గారు, పురందేశ్వరి గారికి నందమూరి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ నంబర్ 1ని ఆశీర్వదించేందుకు వారంతా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
హీరోయిన్ వీణ రావు మాట్లాడుతూ.. ‘‘లోకేశ్వరి గారు, భువనేశ్వరి గారు, పురందేశ్వరి గారు ఈ వేడుకకు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపింది.
హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ.. ‘‘మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, పక్కనే నిల్చుని చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మా నాన్న నందమూరి జానకి రామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా. మా కుటుంబమంతా నన్ను ఆశీర్వదించేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజిది. ఎన్టీఆర్ గారి ఘాట్ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఆయన కుటుంబంలో నాలుగోతరానికి చెందిన వ్యక్తి.. ఆయన పేరు పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం ఈ ప్రదేశంలో జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. పేరు ఎవరైనా పెట్టుకుంటారు కానీ ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం అంత ఈజీ కాదు.ఈ కార్యక్రమం మా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి కుమార్తెల చేతులమీదగా జరగడం అద్భుతమైన అనుభూతి. ఇదొక మిసైల్ లాంచింగ్‌లా.. ఒక మరపురాని ఘట్టం. తారకరామారావుకు అందరి అండదండలు ఉంటాయి. తను మంచి స్థాయికి ఎదగాలని ఒక నందమూరి వీరాభిమానిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల