Farmer Protest Delhi : ‘రైతులకు ఓపెన్ జైలు..’ మోదీ సర్కారుకు ఢిల్లీ ప్రభుత్వం షాక్

Farmer Protest Delhi :

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం.. వివాదాస్పద విద్యుత్తు చట్టం.. 2020-21 ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసుల తొలగింపు.. తదితర డిమాండ్లతో పార్లమెంటు ముట్టడికి బయల్దేరిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కుతున్నారు. వారిని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ‘ఢిల్లీ చలో’ పేరిట వారు చేపట్టిన ఈ ఆందోళన ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, అన్నదాతలు ఢిల్లీలోకి రాకుండా.. వచ్చినవారిని వచ్చినట్లే అడ్డుకునే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సోమవారం రాత్రి రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం పంజాబ్‌, హరియాణా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు బయల్దేరారు. వీరంతా ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రితో దేశ రాజధానికి వస్తున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమించిన రైతన్నలు మరోసారి ఆ సందర్బాన్నే గుర్తుచేస్తున్నారు.

ఓపెన్ జైలులో వేసేద్దాం..

అన్నదాతలను అడ్డుకోవడం ఎలాగో తెలియక మోదీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. దీనికోసం ఢిల్లీలోని బవానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఇక్కడే ఢిల్లీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రైతులను ఓపెన్ జైలుగా బంధించేందుకు బవానా మైదానాన్ని ఇవ్వబోమంటూ తేల్చిచెప్పింది. రైతులను అరెస్టు చేసి జైల్లో వేయడాన్ని తాము అంగీకరించబోమని, ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని ఢిల్లీ హోం మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ కేంద్ర సర్కారుకు లేఖ రాశారు. ‘రైతుల డిమాండ్లు న్యాయమైనవి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రైతులను అరెస్టు చేయడం అన్యాయం’ అని ఆయన స్పష్టం చేశారు.

శాంతి భద్రతలు కేంద్రానివే అయినా..

ఢిల్లీ రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. దేశ రాజధాని కావడంతో ఇక్కడ శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కానీ, జైళ్ల శాఖపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారును కేంద్రం అభ్యర్థించాల్సి వచ్చింది. అయితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఢిల్లిలోని కేజ్రీవాల్ సర్కారును ఎంతగా ఇబ్బంది పెడుతున్నదో అందరూ చూశారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులను జైల్లో వేసింది. కేజ్రీని సైతం మద్యం విధానం కుంభకోణంలో విచారణకు పిలుస్తోంది. పాలనా వ్యవహారాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం సరేసరి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే మోదీ సర్కారును ఇరుకునపెట్టేందుకు బవానా మైదానాన్ని ఇచ్చేందుకు తిరిస్కరించింది. తద్వారా రైతులకు మద్దతుగా నిలిచినట్లుగా కూడా పేరు తెచ్చుకుంది.

పంబాబ్ రైతులదే ప్రధాన పాత్ర..

ప్రస్తుతం ఢిల్లీలో కదంతొక్కుతున్న రైతుల్లో అత్యధికులు పంజాబ్ వారే. ఇంతకూ పంజాబ్ లో అధికారంలో ఉన్నది ఆమ్ ఆద్మీ ప్రభుత్వమేనాయె..? ఈ రీత్యా చూసినా.. ఆందోళనలో పాల్గొంటున్న అన్నదాతలకు కేజ్రీవాల్ సర్కారు అండగా నిలవకతప్పదు. అందుకే బవానా మైదానాన్ని కేంద్రానికి ఇచ్చేందుకు తిరస్కరించడంలో ఢిల్లీ సర్కారుకు రెండు ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 

 

Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *