కోట శ్రీనివాసరావు మరణించి కొన్ని గంటలు కూడా గడవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగుళూరులో నివాసముంటున్న సరోజా దేవి నేటి (సోమవారం) ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండరీ నటులతో ఆమె నటించారు. అలాగే కన్నడ, మలయాళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
200కు పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో తనదైన ముద్ర వేశారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంతో సరోజా దేవి తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 1959లో ‘పెళ్లిసందడి’ చిత్రం ఆమె తొలి చిత్రమైనప్పటికీ.. దీనికంటే ముందు పాండురంగ మహత్యం, భూకైలాస్ ముందుగా విడుదలై గుర్తింపునిచ్చాయి. అక్కడి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సరోజాదేవికి రాలేదు. 1955 నుంచి 1984 మధ్య ఆమె హవా కొనసాగింది. కేవలం 29 ఏళ్లలో సరోజాదేవి 161 సినిమాల్లో నటించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి.