Vijayashanthi :
కాంగ్రెస్ లోనూ దక్కని ప్రాధాన్యం
లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్, ఫైర్ బ్రాండ్.. ఇలా అభిమానులతో పలు పేర్లతో పిలిపించుకొని, సినిమా రంగంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న విజయశాంతి రాజకీయ రంగంలో మాత్రం అవమానాలనే ఎదుర్కొంటున్నారు.
తొలుత బీజేపీలో చేరి కొంతకాలం ఆ పార్టీలో పనిచేసిన విజయశాంతి.. ఒసేయ్ రాములమ్మ సినిమా తరువాత తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తొలినాళ్లలో రాములమ్మగా గుర్తింపు పొందిన విజయశాంతి.. తల్లి తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి కొంత మేర ప్రజల దృష్టిని ఆకర్షించారు.
అయితే అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో పార్టీని స్థాపించి ఉద్యమాన్ని నడుపుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణవాదులందరినీ ఏక్ చేసే ప్రయత్నంలో భాగంగా విజయశాంతిని తన పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు విజయశాంతి.
కేసీఆర్ కూడా ఆమెకు తగిన ప్రాధాన్యమిచ్చి 2009లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ కు గట్టి పట్టున్న మెదక్ లో విజయశాంతి ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తరువాత నుంచే సమస్యలు మొదలయ్యాయి.
ఎంపీగా గెలిపించడంతోనే కేసీఆర్ సరిపెట్టగా.. విజయశాంతి మాత్రం పార్టీలో అధిక ప్రాధాన్యాన్ని ఆశించారు. అది దక్కకపోయే సరికి చాన్నాళ్లపాటు అసంతృప్తితోనే పార్టీలో కొనసాగిన విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ లో చేరారు.
అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలు కావడంతో పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దాదాపు ఐదేళ్లపాటు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు సినిమా రంగానికి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు.
చివరికి 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం విజయశాంతిని పిలిచి స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. కానీ, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేదు. అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు.
ఎన్ని పార్టీలు మారినా కలిసిరాని అదృష్టం
2018 ఎన్నికల తరువాత తెలంగాణలో కేసీఆర్ హవా కొనసాగడం, ఆయనను ఎదుర్కొనడంలో కాంగ్రెస్ వెనకబడి.. బీజేపీ బలం పుంజుకోవడంతో విజయశాంతి 2020లో తిరిగి కమలం గూటికి చేరుకున్నారు. కానీ, అక్కడ కూడా ఎక్కవ కాలం కొనసాగలేకపోయారు.
తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ 2023 నవంబరులో బీజేపీని వీడి.. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కానీ, ఎప్పటిలాగే మళ్లీ తెరవెనుకే ఉండిపోయారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మళ్లీ పోటీకి దూరమయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టాక.. ఒకటి రెండుసార్లు రేవంత్ రెడ్డిని పొగుడుతూ ట్విటర్ లో ట్వీట్లు చేయడం మినహా ఎక్కడా కనిపించలేదు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు.
తాజాగా పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా.. ఏ స్థానం నుంచి కూడా టికెట్ కోసం విజయశాంతి దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరోసారి ఆమె పేరు పరిశీలనకు కూడా రాకుండా పోయింది. పైగా ఆమె కూడా మరోసారి ఎక్కడా కనిపించడంలేదు.
దీంతో విజయశాంతి విషయంలో ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ ఆమెను అభిమానించే వారిలో మొదలైంది. ఏదేమైనా రాజకీయాల్లో విజయశాంతికి ఎన్ని పార్టీలు మారినా అదృష్టం కలిసిరావడంలేదు. ఇందుకు కారణం ఎవరన్నది కాలమే చెప్పాలి.
Also Read This Article : కిషన్ రెడ్డికి అగ్నిపరీక్ష