తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే అంటుంది చట్టం. ఆర్ధిక నేరం కింద హీరో మహేష్ బాబు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 28 న విచారణకు రావాలనీ నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఆ సంస్థలకు సంబంధించిన సూర్య డెవలపర్స్ యాడ్స్‌లో మహేష్ బాబు నటించారు. ప్రమోషన్ కింద రూ.3.4 కోట్లు వైట్ అమౌంట్ తీసుకున్నారు మహేష్. అదనంగా బ్లాకులో మరో రెండు కోట్ల యాభై లక్షలు తీసుకున్నట్లు ఈడీ దృష్టికి వచ్చింది. ఈ మొత్తానికి సంబంధించి ఆయన తన వివరణ ఇవ్వాలని ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని ఈడి ఆఫీస్‌కు రావాలని మహేష్‌కు నోటీసులు పంపారు.
అయితే ఈ విషయమై మహేష్ బాబు ఈడీ విచారణ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఈడీ ఆఫీసుకి ప్రతిరోజూ చాలామంది వస్తుంటారు. అక్కడకి వెళ్లిన తర్వాత ఏదైతో బ్లాక్ అమౌంట్ ఉందో దానికి సంబంధించిన పెనాల్టీ డబ్బును కట్టాలని ఈడీ సూచిస్తుంది. ఆ మొత్తాన్ని కట్టిన తరువాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు వచ్చిన పేరు మహేష్ బాబుది కాబట్టి ఇక్కడ న్యూస్ అయ్యింది. పర్సంటేజ్ ప్రకారం ఈడీ చెప్పే అమౌంట్‌ను మహేష్ కట్టేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 28న ఏం జరుగుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
శివ మల్లాల