Katchatheevu island :
భారతదేశానివని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటన
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. కచ్చతీవు అంశం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు శ్రీలంక స్పందించింది.
కచ్చతీవు దీవులు తమవేనని స్పష్టం చేసింది. ఆ కచ్చతీవు దీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద పేర్కొన్నారు.
కచ్చతీవు దీవుల విషయంలో భారత్ చేసే ఏ ప్రయత్నాన్నైనా తాము సమర్థించడం లేదని తేల్చి చెప్పారు.తమిళనాడు, శ్రీలంకకు మధ్యలో ఉన్న కచ్చతీవు దీవులు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీలను లక్ష్యంగా చేసుకుని.. ప్రధాని నరేంద్ర మోదీ.. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.
దేశ జాతీయ ప్రయోజనాలను పట్టించుకోకుండా 1974 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించారని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దీంతో అప్పటి నుంచి ఈ కచ్చతీవు దీవులపై రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు.. కచ్చతీవు దీవులను నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తిరిగి భారత్‌లో కలిపేస్తుందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలంక స్పందించింది. ప్రస్తుతం భారత్‍లో ఎన్నికల జరుగుతున్న వేళ.. కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవానంద వెల్లడించారు.
సొంత ప్రయోజనాలకు అనుగుణంగా భారత్ వ్యవహరిస్తోందని చెప్పారు.
అంతేకాకుండా 1974 లో జరిగిన భారత్-శ్రీలంక ఒప్పందం ప్రకారం రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు ఈ కచ్చతీవు దీవుల ప్రాంతాల్లో చేపలు పట్టుకోవచ్చని..
అయితే ఆ ఒప్పందం 1976 లో సవరణకు గురైందని తెలిపారు. ఆ సవరణ ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపలు పట్టుకోవడాన్ని నిషేధించినట్లు చెప్పారు.
1976 లో జరిగిన ఒప్పందంలో భాగంగా సముద్రంలో సరిహద్దులు విభజించారని పేర్కొన్నాయి.
కన్యాకుమారికి దిగువన వెస్ట్‌బ్యాంక్ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉందని.. ఎన్నో వనరులు ఉన్న ఆ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కచ్చతీవు దీవుల కంటే 80 రెట్లు పెద్దదని.. 1976 ఒప్పందం ప్రకారం అది భారత్‌కు దక్కిందని దేవానంద వెల్లడించారు.
ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 23 ఫిషింగ్ బోట్‌లను, 178 మంది భారత మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసిన ప్రతిసారీ.. వారిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖలు రాస్తున్నారు.
వారి అరెస్టులను నరేంద్ర మోదీ అడ్డుకోవడంలేదని డీఎంకే నేతలు మండిపడుతున్నారు.
ఈ ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్, డీఎంకేలకు షాక్ ఇచ్చేందుకే కచ్చతీవు దీవుల అంశాన్ని ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ కచ్చతీవు దీవుల అంశం హఠాత్తుగా వచ్చిందేమీ కాదని.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉందని.. దీనిపై తమిళనాడు సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.
Also Read This Article : అలాంటి దిక్కుమాలిన పనులు మేం చేయం