Delhi Liquor Case :
తీహార్ జైలుకు ఢిల్లీ ముఖ్యమంత్రి తరలింపు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. తాజాగా రోస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్‌ను కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా.. కోర్టు తొలుత మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా.. ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. అధి కూడా ముగియడంతో కేజ్రీవాల్‌ను సోమవారం కోర్టలో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు తన వాదనలను వినిపించారు. ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించలేదని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.
కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానలు ఇస్తున్నారని చెప్పారు. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని, తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో కొన్ని మందులు అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. అలాగే, జర్నలిస్ట్ నీరజ్ చౌదరి రాసిన రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్, మహాభారత అనే మూడు పుస్తకాలను ఇవ్వాలని అన్నారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన లాకెట్, టేబుల్ కుర్చీని కూడా అడిగారు.
అయితే కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో ఏ జైలులో ఉంచుతారనే చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ను జైలు నంబర్ 2 నుంచి జైలు నంబర్ 5కి మార్చారు. మనీష్ సిసోడియాను జైలు నంబర్ 1లో ఉంచారు. సత్యేంద్ర జైన్‌ను జైలు నంబర్ 7లో ఉంచారు. తీహార్ జైలులో మొత్తం 9 జైళ్లు ఉండగా దాదాపు 12 వేల మంది ఖైదీలు ఉన్నారు.
Also Read This Article : ఉమ్మడి రాజధానిపై ఏపీ కింకర్తవ్యం?