Cricket News:క్రికెటర్లకు కాంట్రాక్టులు.. హైదరాబాదీలకు బొనాంజా

Cricket News:

అనుకున్నట్లే ఆ ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది.. ఊహించినట్లే వారిపై చర్యలు తప్పలేదు.. సరిగ్గా మూడు నెలల కిందటి వరకు ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో జట్టులో భాగంగా ఉన్న వారు.. ఇప్పుడు కనీసం కాంట్రాక్టుల జాబితాలోనూ లేరు. మేటిగా ఆడితే ఏడాదికి రూ.3 కోట్లు.. మెరుగ్గా రాణిస్తే రూ.2 కోట్లు.. ఫర్వాలేదనే ప్రదర్శన చేసినా రూ.కోటి.. కానీ, ఈ డబ్బు వారికి వద్దనిపించిందేమో..? ఏకంగా బీసీసీఐనే ధిక్కరించారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇదంతా టీమిండియా (మాజీ) క్రికెటర్ల ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ గురించి.

కాంట్రాక్టుల నుంచి ఔట్

2003 చివర్లో దక్షిణాఫ్రికా టూర్ నుంచి మధ్యలో వచ్చేసిన ఇషాన్ కిషన్, ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వెన్నునొప్పి అంటూ తప్పుకొన్న శ్రేయాస్ అయ్యర్ లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో చోటుదక్కలేదు. 2023-24 సంవత్సరానికి భారత క్రికెట్‌ బోర్డు ప్రకటించిన జాబితాలో హైదరాబాద్ ఆటగాళ్లు, యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ, పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రతిభకు మాత్రం బహుమతి లభించింది. జాతీయ జట్టుకు ఆడనపుడు దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలన్న నిబంధనను ఉల్లంఘించిన కిషన్‌, శ్రేయస్‌ తగిన మూల్యం చెల్లించుకున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చేసిన కిషన్ ను సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టుకు ఆడాలని బీసీసీఐ కోరినా వినలేదు. ఇక అయ్యర్ వెన్నునొప్పి అని చెప్పినా అదేమీ లేదని జాతీయ క్రికెట్ అకాడమీ తేల్చింది. దీంతో ఇతడినీ రంజీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. ఇద్దరూ దీనిని పెడచెవిన పెట్టారు. కిషన్ ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాతో కలసి ప్రాక్టీస్‌ లో పాల్గొన్నాడు. అయ్యర్ను ముంబై తరఫున అసోం, బరోడాతో మ్యాచ్ లలో ఆడాలని కోరినా పట్టించుకోలేదు.

ఏ ప్లస్ వీరే..: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా
ఎ గ్రేడ్ లో వీరు: అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, పాండ్యా. వీరిలో రాహుల్‌, గిల్‌, సిరాజ్‌ గ్రేడ్‌ Aకు పదోన్నతి పొందారు.
గ్రేడ్ బిలో వీరు: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిగా జట్టుకు దూరమైన పంత్‌ కు గ్రేడ్ మార్చలేదు.
గ్రేడ్ సిలో వీరు: రింకూసింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్.

టి20ల్లో చోటు పక్కా చేసుకుంటున్న హిట్టర్ రింకూ సింగ్, హైదరాబాద్ బ్యాటర్ తిలక్‌ కొత్తగా గ్రేడ్‌ ‘సి’లోకి వచ్చారు. ఈ కాంట్రాక్టులు అక్టోబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30, 2024 వరకు అమలులో ఉంటుంది.

కొత్తగా ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్టు

బీసీసీఐ కొత్తగా ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ను సిఫార్సు చేసింది. ఇందులో ఆకాశ్‌ దీప్‌, విజయ్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యశ్‌ దయాల్‌, విద్వత్‌ కావేరప్ప పేర్లున్నాయి. అయితే, ఆకాశ్, ఉమ్రాన్ ఇప్పటికే టీమిండియాకు ఆడారు. మిగతావారు అరంగేట్రం చేయాల్సి ఉంది.

 

Also Read:AP Political News:24-24-24 జనసేన తొలి లిస్ట్ లో విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *