Congress upset with BRS sketch:
రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజమే! కానీ, వాటిని గుర్తించి అప్రమత్తం కాకపోతే మాత్రం ప్రత్యర్థి చేతిలో పరాభవం తప్పదు.
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కు అదే ఎదురైంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో ఎట్టకేలకు తాత్కాలికంగానైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ పైచేయి సాధించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ సిఫారసుతో ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక న్యూస్ ఎడిటర్ ఆమిర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది.
ఎమ్మెల్సీలుగా వీరితో ప్రమాణం చేయించకుండా యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ తో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది.
నామినేట్ చేయలేనంటూ గవర్నర్
అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాలంటే సామాజిక సేవ, సాహిత్యం, కళలు వంటి వాటిలో ఏదో ఒక దాంట్లో కృషి చేసిన వారై ఉండాలని, వీరిద్దరికీ అలాంటి చరిత్ర లేదని, వారు రాజకీయ నేపథ్యం ఉన్నవారైనందున ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయలేనంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. ప్రభుత్వ సిఫారసును తిరస్కరించారు. దీనిపై శ్రావణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గవర్నర్ కోటాలో కోదండరాం, ఆమిర్ అలీఖాన్ ల పేర్లను సిఫారసు చేసింది.
అయితే దీనిపై కోర్టులో పిటిషన్ ఉన్నందున గవర్నర్ న్యాయ సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటానంటూ కొద్దిరోజులు పెండింగ్ లో పెట్టారు.
ఆపై కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ ల నియామకానికి ఓకే చెప్పారు.
తాము సిఫారసు చేసిన వారిని తిరస్కరించిన గవర్నర్.. కాంగ్రెస్ చేసిన సిఫారసుకు మాత్రం ఆమోదం తెలపడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది.
దాసోజు శ్రావణ్ కు రాజకీయ నేపథ్యం ఉందన్న గవర్నర్ కు.. తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? అని ప్రశ్నించింది.
మరోవైపు దీనిని అడ్డుకోవడానికి కోర్టులో తాము చేయాల్సిన ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. మరో చాణక్యాన్ని ప్రదర్శించింది.
గవర్న్ నుంచి ఎమ్మెల్సీలుగా నామినేట్ అయినట్లుగా పత్రాలు అందుకున్న కోదండరాం, ఆమిర్ అలీఖాన్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు ఈ నెల 29వ తేదీన శాసనమండలికి వెళ్లగా.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడికి రాలేదు.
దీనిపై ఒక్కసారిగా ఆయనపై విమర్శలు రావడంతో.. తనకు కొంత అస్వస్థతగా ఉన్నందున రాలేదని, పైగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ ఇద్దరూ తన అపాయింట్ మెంట్ తీసుకోకుండా వచ్చారని సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
దీంతో తాము మళ్లీ ఈ నెల 31వ తేదీన చైర్మన్ అపాయింట్ మెంట్ తీసుకొని వస్తామని కోదండరాం చెప్పారు. కానీ, ఈలోగా బీఆర్ఎస్ అధిష్ఠానం చేయాల్సింది చేసింది.
దాసోజు శ్రావణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 30న హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో తాము వేసిన పిటిషన్‌పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని పిటిషన్‌లో వారు కోరారు.
దీంతో కోర్టు దీనిపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశించింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి హైకోర్టు వాయిదా వేసింది. ఆరోజు ఏం తేలుతుందో తెలియదుగానీ.. కోదండరాం, ఆమిర్ అలీఖాన్ లకు మాత్రం ఇది నిరాశ కలిగించే విషయమే. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి పైఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.
Also read : బ్రో.. ఐ డోంట్ కేర్! ఏం చేసుకుంటారో చేసుకోండి: షర్మిల