Congress :
రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. దశాబ్దాలుగా ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలు ఇప్పుడు కఠిన పరీక్షగా నిలిచాయి.
అమేథీలో 2019 ఎన్నికల్లోనే రాహుల్ ఓటమిపాలు కాగా, ఈసారి రాయ్ బరేలీ కూడా సవాలుగా మారింది.
గత ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిన రాహుల్.. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఎన్నికల్లో కూడా రాహుల్ వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు.
దీంతో అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేది ఎవరనే ప్రశ్న తలెత్తింది.
మరోవైపు రాయ్ బరేలీ నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని రాజ్యసభకు ఎన్నికయ్యారు.
దీంతో రాయ్ బరేలీ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఈ రెండు స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
అయితే ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెరపడే అవకాశం ఉన్నట్ల తెలుస్తొంది. ఈ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్ 30వ తేదీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ ఇప్పటికే నామినేషన్ వేసిన కేరళలోని వయనాడ్ స్థానానికి ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున అమేథి, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
దీంతో వయనాడ్‌లో పోలింగ్ ప్రక్రియ ముగియగానే అమేథీ, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాలపై అన్నాచెల్లెళ్లు దృష్టి సారించనున్నట్లు సమాచారం.
అయోధ్య బాలరాముడి దర్శనానికి అన్నాచెల్లెళ్లు..!
అమేథి, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మే 3. చివరి తేదీకి రెండు రోజుల ముందు రాహుల్, ప్రియాంక నామినేషన్లు వేసే అవకాశం ఉందంటున్నారు.
ఇక నామినేషన్ల దాఖలు కంటే ముందు.. అన్నాచెల్లెళ్లు అయోధ్య బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో నిర్వహించిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వీరు ఇప్పుడు దర్శనానికి వెళ్లాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read This Article : ఏపీలో మళ్లీ జగనే సీఎం – కేసీఆర్