అవును.. కృష్ణా ప్రాజెక్టుల వివాదం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకుంది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల
నిర్వహణ బాధ్యతలన్నీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తెలంగాణ
ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ, ఏపీకి నీటి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో..
వాటిని పరిష్కరించే బాధ్యతను కేంద్రం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించగా.. అది ఎటూ తేలకముందే కొత్త సమస్యలు
పుట్టుకొచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణా బేసిన్ నుంచి 811 టీఎంసీలను కేటాయించారు. ఆ నీటిని ఏపీకి 66 శాతం,
తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయించారు. అయితే రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణలో నీటి అవసరాలు పెరగడంతో 34 శాతం
సరిపోవని, రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున కేటాయించాలని గత బీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ వివాదం తీరని
సమస్యగా మారడంతో.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం రెండేళ్ల క్రితం గెజిట్ జారీ చేసింది.
అయితే ఇందుకు ఏపీ సర్కారు అంగీకరించి.. జీవో కూడా జారీ చేసింది. కానీ, తెలంగాణ కూడా అంగీకరించి.. కృష్ణా బేసిన్ లోని మొత్తం 15
కాంపొనెంట్లను అప్పగిస్తేనే తమ జీవోను అమలు చేస్తామని మెలిక పెట్టింది. అయితే ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ నిరాకరించింది.
నీటి వాటాలు తేలకుండా, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి లెక్కలను ఖరారు చేయకుండా తాము ప్రాజెక్టులను అప్పగించేది లేదని
స్పష్టం చేసింది. దీంతో ఈ అంశం ఇన్నాళ్లుగా పెండింగ్ లోనే ఉంది. పలుమార్లు గడువులు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. చివరగా గత ఏడాది
అక్టోబరు నాటికి అప్పగించాలని పేర్కొంది. అయితే అది కూడా జరగకపోగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు నాటకీయ
రీతిలో ఏపీ పోలీసులు తమ రాష్ట్రంపైపు ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే
రేగింది.
ఏపీ పోలీసులు
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు.. తమ మిత్రుడైన ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై మరోసారి తెలంగాణ సెంటిమెంట్
ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయినా.. ఎన్నికల్లో బీఆర్ఎస్
ఓటమిపాలు కాగా, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు జోక్యం చేసుకొని.. ఏపీ పోలీసులు వెనక్కి వెళ్లేలా చేశారు. అనంతరం.. తెలంగాణలో కొత్తగా
ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. కానీ, కేంద్ర జలశక్తి శాఖ మాత్రం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను
స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ
అధికారులతో సమావేశం నిర్వహించింది. నెల రోజుల్లోగా ప్రాజెక్టలను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు ఏపీ
అధికారులు ఎప్పటిలాగే అంగీకరించి వచ్చారు. కానీ, తెలంగాణ అధికారులు మాత్రం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని
అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి, అటునుంచి లండన్ కు వెళ్లడంతో ఈ అంశం పెండింగ్ లో పడింది. కానీ, ఏపీ
ప్రభుత్వం మాత్రం నెలరోజుల్లోగా రెండు ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి వెళతాయంటూ ప్రచారం చేసుకుంటోంది. త్వరలో పార్లమెంటు
ఎన్నికలు జరగనుండడంతో దీనిని తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ ఆయుధంగా మలచుకుంది. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
వెళితే.. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణను పూర్తిగా కోల్పోతుందని, రాష్ట్రంలో సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు
తలెత్తుతాయని చెబుతోంది. చుక్క నీరు కావాలన్నా బోర్డును ప్రాధేయపడాల్సిన పరిస్థితి వస్తుందని అంటోంది. అందుకే తాము ఇన్నాళ్లుగా
తాము ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా కాపాడుకుంటూ వచ్చామని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా అవి ఇప్పుడు బోర్డు
అధీనంలోకి వెళ్లబోతున్నాయని ఆరోపిస్తోంది. తద్వారా రేవంత్ సర్కారును ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు కూడా ఆత్మరక్షణలో పడిపోయినట్లే కనిపిస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను బోర్డుకు
అప్పగించబోమని చెబుతున్నా.. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో మాత్రం అప్పగించాలనన నిబంధన ఉంది. దానిని ఆధారం
చేసుకొనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. ఇన్నాళ్లుగా నీటి పంపకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని జాప్యం చేసినట్లుగానే
తాము కూడా చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కేంద్రం చట్టాన్ని అమలు చేస్తే.. అప్పగించక తప్పని
పరిస్థితులు వస్తాయన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే విమర్శలకు, ప్రజలకు సమాధానం
చెప్పకోలేని పరిస్థితి వస్తుంది. దీంతో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. దీని నుంచి ప్రభుత్వం ఎలా
బయటపడుతుందో, ఎన్నాళ్లు జాప్యం చేయగలుగుతుందో చూడాల్సి ఉంది.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…