BRS To Congress :
తెలంగాణలో హ్యాట్రిక్ ఆశలు గల్లంతయి ప్రతిపక్షానికి పరిమితమై.. అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు మరో కీలక ఎంపీ షాక్ ఇవ్వనున్నారా..? పార్టీ ఇప్పటికే టికెట్ ఖరారు చేసినా.. లెక్క చేయకుండా కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? ముందుగా తన నియోజకవర్గ పరిధిలోని కీలక మేయర్ ను హస్తం పార్టీలోకి పంపి ఆ తర్వాత తానూ చేరనున్నారా? ఇప్పటికే సీఎం నుంచి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ పొందారా? పరిస్థితులు చూస్తుంటే ఇది వాస్తవమే అనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ప్రారంభంలో ఆయన బీఆర్ఎస్ కు బైబై చెప్పడం ఖాయమని తెలుస్తోంది.
ఆ ఇద్దరిలో ఈయన ఒకరు
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వెంటనే లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు సిటింగ్ ఎంపీలకు మాత్రమే టికెట్ ఖరారు చేసింది. వారిలో ఒకరు నామా నాగేశ్వరరావు. అయితే, ఈయన కాకుండా టికెట్ దక్కిన మరో ఎంపీ మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ సమీన నియోజకవర్గానికి చెందిన ఈ ఎంపీ.. బీఆర్ఎస్ అధిష్ఠానానికి బాగా సన్నిహితులు. ఆ పార్టీ హై కమాండ్ వేళ్ల మీద లెక్కబెట్ట గల విధేయుల్లొ ఒకరు. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. అందరికంటే ముందే టికెట్ దక్కినా కారు దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆయన వెళ్తే దెబ్బనే..
బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కు ఒకటీ అరా మాత్రమే దక్కాయి. రాజధానిలో అయితే అసలేమీ రాలేదు. మరోవైపు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలి. పనిలోపనిగా బీఆర్ఎస్ ను బలహీనం చేయాలి. అందుకనే సాధ్యమైనంత ఎక్కువగా చేరికలు ప్రోత్సహిస్తోంది అధికార కాంగ్రెస్. ఆ క్రమంలో హైదరాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన ఎంపీని చేర్చుకుంటోందని సమాచారం. ఈయన నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సెంటిమెంట్. అయితే, అక్కడి ప్రజాప్రతినిధి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆ నేతపై నైతికంగా పైచేయి సాధించేందుకూ.. ఎంపీని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నట్లు భావించవచ్చు.
ముందుగా స్థానిక ప్రజాప్రతినిధి పంపి
హైదరాబాద్ పరిసర ప్రాంత బీఆర్ఎస్ ఎంపీ ముందుగా తాను కాంగ్రెస్ లో చేరకుండా స్థానిక ప్రజాప్రతినిధిని పంపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గం పరంగానూ అనుకూలత ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఆ ఎంపీ ఆర్థికంగా చాలా బలవంతులు. ఆయన అధికార పార్టీలో చేరితే స్థానిక సంస్థలపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఎలాగూ ఆ కీలక నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాయకుడు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో అన్నీ ఆలోచించి బీఆర్ఎస్ సిటింగ్ ఎంపీకి రైట్ రైట్ చెప్పినట్లు సమాచారం.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…