Barrelakka :
బర్రెలక్క… ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరేమో! సోషల్ మీడియా ద్వారా ఈమె ఆ స్థాయిలో పాపులర్ అయ్యారు మరి!!
ఆ పాపులారిటీతో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి.. అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఈసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు బర్రెలక్క సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలను కాస్తున్నారు. తొలుత.. ‘నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా’ అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు.
అంతే.. ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చి శిరీష కాస్తా.. బర్రెలక్క అయిపోయారు.
ఆ తరువాత చాలా యూట్యూబ్ చానళ్లు పోటీపడి ఆమెను ఇంటర్వూలు చేశాయి. అలా మరింత పాపులారిటీ రావడం, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. బర్రెలక్క దృష్టి ఆ ఎన్నికలపై పడింది.
పెద్ద వ్యక్తులు కూడా ఆమెకు అండగా
ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న బర్రెలక్క.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చాలా మంది బర్రెలక్క కు మద్దతుగా నిలిచారు.
చాలా మంది పెద్ద వ్యక్తులు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.
దీంతో ఆ ఎన్నికల్లో బర్రెలక్క విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే కొల్లాపూర్ లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెకు దాదాపు 6 వేల ఓట్లు వచ్చాయి.
ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారుమోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని బర్రెలక్క నిర్ణయించుకున్నారని, అందుకే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
ఇంతకుముందు బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమె పట్ల సానుభూతి చూపాయి.
ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను ఆమె ముందుగానే తమతో చెప్పి ఉంటే తమ పార్టీ తరఫునే అభ్యర్థిగా నిలిపేవారమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివాళ్లు అన్నారు.
అప్పటికే కొల్లాపూర్ లో తమ అభ్యర్థిని పోటీలో నిలిపినందున ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ మాత్రం చెబుతామన్నారు.
అయితే అప్పుడు ఎలాగో అవకాశం లేకపోయినా.. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బర్రెలక్క ముందుగానే చెప్పినందున ఏ రాజకీయ పార్టీ అయినా ఆమెను తమ అభ్యర్థిగా ప్రకటిస్తుందేమో చూడాలి.
Also Read : మాట”తో చేస్తున్న సేవకు చాలా ఆనందంగా ఉంది.
