పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘హరి హర వీరమల్లు’ మళ్లీ వాయిదా

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన పవన్ అభిమానుల్లో ఒకింత నిరాశను నింపేదే. జూన్ 12న ఈ సినిమా విడుదల కాబోతోందని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ‘‘గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము’’ అని మేకర్స్ తెలిపారు.

కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనే ప్రయత్నంలో భాగంగానే సినిమా విడుదలకు మరికొంత సమయం తీసుకుంటున్నట్టు మేకర్స్ వెల్లడించారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం తమ దృష్టికి వచ్చిందన్నారు. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారని.. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని తాము ప్రతి ఒక్కరినీ కోరుతున్నామని వెల్లడించారు. అధికారిక ప్రకటనలనే నమ్మాలని ప్రకటించారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *