...

AP Politics Review : సినిమా రివ్యూ– ఆంధ్రమసాలా

AP Politics Review :

ఎవరి రాతయినా దేవుడు రాస్తాడు అంటారు..కానీ రాజకీయ నాయకుల రాత మాత్రం తమ మాటలతో, చేష్టలతో ( అది మంచి కావొచ్చు, చెడు కావొచ్చు) తమ రాత తామే రాసుకుంటారు.

దానికి ప్రత్యక్ష ఉదాహరణే 2024లో జరిగిన అనేక ఎలక్షన్స్‌.

సినిమా పేరు : ఆంధ్ర మసాలా..

నటీనటులు : వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, వై.యస్‌ షర్మిల, రోజా, అచ్చెన్నాయుడు, విజయసాయి రెడ్డి..మరో వెయ్యిమంది నటించిన భారీ తారాగణం

ఎడిటర్‌ : ఓటేసిన ఓటర్స్‌

కెమెరా : ఎన్నో వేల కెమెరాలు

స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ : పిన్నెల్లి

డాన్స్‌ డైరెక్టర్‌ : అంబటి వారు

మాటలు : పేర్ని, వంశీ, కొడాలి, రోజా, నారాలోకేశ్‌

స్క్రీన్‌ప్లే : సజ్జల రామకృష్ణా రెడ్డి, సజ్జల భార్గవ్‌

నిర్మాతలు : చిత్రంలో నటించిన నటీనటులు

దర్శకత్వం : ఫ్యాన్‌–సైకిల్‌ పైన గ్లాస్‌

కధ :

సినిమా ఓపెన్‌ చేస్తే 2019లో హీరో (అప్పటి హీరో) ఒంటరి పోరాటం చేసి ప్రతి ఇంటి మెట్లు ఎక్కుతాడు. అవ్వ తాత అక్కా తమ్ముడు అంటూ వరుసలు కలిపి ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ కృష్ణవంశీ ఖడ్గం సినిమాలోని డైలాగ్‌ చెప్తాడు.

అన్ని వరసల వారు ఎంతో ఆప్యాయంగా ఓట్లేసి గెలిపించారు. టైటిల్స్‌కి ముందే ఇవన్నీ చూపించటంతో సినిమాలో తర్వాత ఏం జరగబోతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. హీరోకి గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు పట్టం కట్టారు.

అప్పుడు హీరో అందరికి మంచి చేయాలి అనుకుని అనేక పథకాల ద్వారా ఫ్రీగా డబ్బులు పంపిణీ చేస్తే సరిపోతుంది అనుకుని తనని నమ్మి ఓటేసిన వారినే కాకుండా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటే మరోసారి పోటిచేసి గెలవొచ్చు అనుకుంటాడు.

అప్పటివరకు గతంలో తనను కష్టపెట్టిన వారందరిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఏకైక లక్ష్యంతో హీరో పనిచేసే విధంగా చుట్టుపక్కల అనేకమంది శకునిలు తయారవుతారు.

ఈ క్రమంలో ఎంతో మేలు చేయాలి అనుకున్న హీరో లక్ష్యం పక్క దోవ పడుతుంది. ఇంతలోనే దావానవంలా చైనా నుండి కరోనా రావటంతో ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్ధంకానీ ప్రజలంతా సోషల్‌ మీడియా మత్తులో మునిగితేలారు.

అందరు ఎంతో టాలెంట్‌ నాయకుడు పంపిన డబ్బుతో శుభ్రంగా తిని పనిపాట లేకుండా తీరిగ్గా కూర్చోవటానికి అలవాటు పడ్డారు.

ఇదే అదనుగా చేసుకుని మిగతా నాయకులంతా చేతులు కలిపి ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు.

అధికారంలో లేనప్పుడు ఇంటింటికి తిరిగిన హీరో అధికారం చేతికందగానే తనను నమ్మకంగా గెలిపించుకున్న యం.యల్‌.ఏలకు కూడా అందుబాటులో ఉండటం లేదు అనే అపవాదును మూటకట్టుకున్నాడు.

ఇంట్రెవల్‌ బ్యాంగ్‌ :

దేవుడు ఇతన్ని ఏం చేయాలి అని ఆలోచించటం మొదలు పెట్టాడు. విలన్‌గ్యాంగ్‌కి హీరో సొంతింట్లే నుండే పొగ పెట్టటం ఎలా అనే కోర్స్‌ను కండక్ట్‌ చేశారు.

ఆ కోర్స్‌లో పి.హెచ్‌.డి డిగ్రీ చేసి గోల్డ్‌మెడల్‌ సాధించి తెలంగాణా రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన వైయస్‌. షర్మిల ఎంట్రీ ఇచ్చారు.

ఇక్కడ ఇంట్రెవల్‌ బ్యాంగ్‌. ఇక ఇక్కడినుండి కథలో హీరో ఎవరు విలన్లు ఎవరు అనే పాయింట్‌కి తావే లేకుండా దర్శకత్వం వహించిన ఫ్యాన్, గ్లాస్, సైకిల్‌ సోషల్‌ మీడియా అనే అస్త్రాన్ని ఉపమోగించి ఎవరి ప్రమోషన్‌ వారు చేసుకున్నారు.

ముఖ్యంగా సినిమా స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాను డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకున్న సినిమాలను కూడా పక్కనపెట్టి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టటంతో ఓటరు తన నిజాయితీని ఎంతో నిజాయితీగా నమ్మారు.

ప్రీక్లైమాక్స్‌కు వచ్చే వరకు ఈ సినిమాలో విలన్‌ ఎవరో హీరో ఎవరో అనే కన్ఫూజన్‌కి తెరపడింది.

2024 జూన్‌ 4న జరిగిన పరిణామాలే ఈ సినిమాలో కథానాయకుణ్ని డిసైడ్‌ చేయటంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ సినిమాలో నీతి ఏంటంటే అవకాశం అడిగినప్పుడల్లా దేవుడు ఇవ్వడు.

అవకాశం వచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానిని దుర్వినియోగం చేయకూడదు అనే నీతితో కథను ఎండ్‌ చేయటం సినిమా ప్రేక్షకులకు సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది.

సినిమా బలాబలాలు :

–2019 ఎలక్షన్‌లో వచ్చిన రిజల్ట్‌

–రాజకీయం అనేది ప్రతికారం కోసం కాదు ప్రజల కోసం

– ప్రజల్లో ఓటుపై వచ్చిన అవగాహన

– అధికారం ఉన్నప్పుడే హుందాగా వ్యవహరించాలి

– అధికార పీఠంపై ఉన్నప్పుడు ఎలా ఉన్నాం అనేది ప్రతి ఒక్కటి లెక్కే..

– పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని ఊర్లను బాగుచేసిన విధానం

– ఎడ్యుకేషన్‌ సిస్టం

సినిమా బలహీనతలు :

– ఒక్క బటన్‌ నొక్కి ఎన్నో లక్షలమందికి దూరమవ్వటం

– గ్రామస్థాయి నాయకులకు అందుబాటులో లేకపోవటం

– అపోజిషన్‌కు వీళ్లే పబ్లిసిటీ చేయటం

– డబ్బు పంచి డబ్బు గుంజటం ( కరెంట్, బస్, రిజిస్ట్రేషన్‌ ఇలాంటి సవాలక్ష చార్జీల పెంపు)

– మూడు రాజధానుల వ్యవహారం

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే అంటే సినిమా ప్రేక్షకులు చప్పట్లు చరిచారు అది రజనీకాంత్‌ నటించిన భాషా సినిమా.

అదే మాట అధికారంలో ఉన్న ఎవరన్నా కూడా ఓటు రూపంలో వచ్చి తలా ఓ మొట్టికాయ మొట్టి మీరు భాషా కాదు భాదుషా అని నోట్లో వేసుకుని చప్పరిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.

అధికారంలోకి వచ్చే వారు కూడా పగలు, ప్రతీకారాలు అనుకోకుండా అవన్నీ ఎలక్షన్‌ వరికే అని వదిలేసి ఓటేసిన ప్రజలకు మంచి చేయాలి అనే ధృక్పధంతో ముందుకు పోవాలి అని కోరుకుంటూ….గ్లాస్‌ను సైకిల్‌ పైన పెట్టుకుని నీట్‌గా సైకిల్‌ని నడపండి.

పని అయిపోయింది కదా అని గ్లాస్‌ని కిందపడేస్తే గాజుపెంకులు గుచ్చుకుని సైకిల్‌కి పంచర్లు పడతాయి. తస్మాత్‌ జాగ్రత్త…ట్యాగ్‌తెలుగు రివ్యూ…

 

Also Read This : రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన కేసీఆర్

 

Srinivas Bhogireddy Exclusive Interview
Srinivas Bhogireddy Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.