AP politics:లోక్ సభ ఎన్నికలకు మరెంతో సమయం లేదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయోధ్య రామమందిరాన్ని నమ్ముకుని ఎన్నికలను ఈదాలని
చూస్తోంది. ప్రతిపక్షాలేమో కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని నెగ్గాలని భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు అన్ని పార్టీలకూ
కీలకమే. ఇక ఏపీ విషయానికి వస్తే అధికార వైఎస్సార్సీపీ 25కు 25 పార్లమెంటు స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆచరణలో ఇది
ఎంతవరకు సాధ్యం అనేది పక్కనపెడితే.. లక్ష్యం మాత్రం పెద్దదే. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఈసారి గెలవకుంటే ఇక అంతే అనే పట్టుదలతో
పోరాడుతోంది. విచిత్రం ఏమంటే ఈ రెండు పార్టీలకూ గుంటూరు సీటు మహా ఘాటెక్కిస్తోంది.
రాయుడు రనౌట్.. గల్లా గుడ్ బై
గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 22 ఎంపీ సీట్లు నెగ్గింది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం మాత్రం చేజార్చుకుంది. వీటిలో టీడీపీ తరఫున గుంటూరు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆయన పార్లమెంటులో బయట తనదైన ముద్ర చూపారు. అయితే, హఠాత్తుగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీనికిముందే వైసీపీ తరఫున మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరి.. రెండు వారాల వ్యవధిలోనే వెనక్కువచ్చారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వాస్తవానికి రాయుడు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని నెలల నుంచి వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆ పార్టీలో చేరడంతో గుంటూరు నుంచి పోటీ ఖాయం అనుకున్నారు. అయితే గుంటూరు నుంచి నరసరావుపేట ఎంపీని బరిలో దింపాలని వైసీపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తేలడంతో రాయుడు వైసీపీకి గట్టి స్ట్రోక్ ఇచ్చారు.
గుంటూరు మంట నరసరావుపేటకూ..
గుంటూరు సీటు వ్యవహారం నరసరావుపేటకూ తగిలింది. అక్కడ ఎంపిగా ఉన్న లావు శ్రీక్రిష్ణ దేవరాయులును వైసీపీ నాయకత్వం గుంటూరు ఎంపీగా పోటీచేయాలని కోరడంతో ఆయన ఏకంగా ఆ పార్టీకే గుడ్ బై చెప్పారు. ఈ పరిణామాలన్నిటి మధ్యనే ఏపీ పార్టీలకు గుంటూరు కారం ఘాటుగానే తగిలినట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లొ అసలు గుంటూరు అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గత రెండుసార్లు తనకు దక్కని ఈ సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని ప్రాంతంలో ఆయువుపట్టు లాంటి సీటును కోల్పోకూడదని టీడీపీ భావిస్తోంది. అయితే, రెండు పార్టీలకూ ఇప్పుడు అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ-జనసేన పొత్తులో ఈ సీటు ఎవరికి దక్కుతుందో? అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం.
కొసమెరుపు: అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా యావరేజ్ గా మిగిలిపోయిందేమో గానీ.. ఎన్నికల ముంగిట మాత్రం గుంటూరు సీటు అన్ని పార్టీలను ఘాటెక్కిస్తోంది.