AP Political Heat:
అప్పట్లో..
ఐదేళ్ల పాటు జన రంజక పాలన.. అంతకంతకూ పెరిగిన ప్రజాభిమానం.. పార్టీలో సొంతంగా తనదైన ముద్ర… రాజకీయంగా రాటుదేలిన వ్యూహ చతురత.. ఇదీ 2004-09 మధ్య ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిస్థితి. అయితే, ఆయన పాలన చివరికి వచ్చేసరికి అప్పటి ప్రతిపక్షాలు కూటమి కట్టాయి.. కొత్తగా ఓ బలమైన పార్టీ పుట్టింది.. ఎప్పటిలానే ఓ వర్గపు మీడియా వ్యతిరేక కథనాలతో యుద్దమే చేసింది..
ఇప్పుడు..
తాను నమ్ముకున్నట్లే ఐదేళ్ల పాటు సంక్షేమ పాలన.. ప్రజాభిమానంలో పైచేయి.. పార్టీనే ఆయన సొంతం.. కీలకమైన రాజకీయ వ్యూహాలు.. ఇక అప్పట్లో ఓ పార్టీ రాజకీయల్లోకి ప్రవేశిస్తే.. ఇప్పుడు ఏకంగా ఆయన సోదరే రాజకీయం చేస్తున్నారు. నాడు ప్రతిపక్షాలు కూటమి కడితే.. నేడూ రెండు పక్షాలు కూటమి కట్టాయి. వ్యతిరేక మీడియా సరేసరి. 2019-24 మధ్య ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితిది.
2004-09 మధ్యన అచ్చం నాన్న వైఎస్ తరహా పరిస్థితినే ఇప్పుడు కుమారుడు వైఎస్ జగన్ ఎదుర్కొంటున్నారు. వీరిద్దరి ఐదేళ్ల పాలనను పరిశీలిస్తే.. ఎన్నో వివాదాలు, విశేషాలు. తండ్రీ కొడుకులు సీఎంలు కావడమే విశేషం అంటే.. తండ్రి లాంటి సందర్భమే జగన్ కూ ఎదురవడం విశేషం. ఇక విషయంలోకి వస్తే.. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తనదైన శైలి పథకాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, తదితరాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆయనది తిరుగులేని స్థాయి. ఇక రాజకీయంగా చూస్తే టీడీపీ-టీఆర్ఎస్-వామపక్షాలు మహా కూటమి కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సవాల్ విసిరారు. అయినా ఒంటిచేత్తో రెండోసారి కాంగ్రెస్ ను గెలిపించారు వైఎస్.
ఇప్పటి జగన్ సంగతి తీసుకుంటే.. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. అయినా జగన్ తొణకడం లేదు. తాను ఐదేళ్ల పాటు అమలు చేసిన సంక్షేమ పథకాలనే నమ్ముకుని రంగంలోకి దిగుతున్నారు. అప్పటికంటే జనసేన బలం పుంజుకోగా.. టీడీపీని మాత్రం జగన్ గట్టి దెబ్బకొట్టారు. ఇక బీజేపీది ఎలాంటి పాత్రనో తెలియాల్సి ఉంది. అయితే, జగన్ కు అనూహ్యంగా తన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నుంచి షాక్ ఎదురవుతోంది. నాడు వైఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం రూపంలో కొత్త పార్టీ రాగా.. ఇప్పుడు షర్మిల రూపంలో జగన్ కు వ్యతిరేకంగా కొత్త నాయకురాలు తెరపైకి వచ్చారు. మరి తండ్రిలాగానే జగన్ రెండోసారి కూడా వరుసగా విజయం సాధిస్తారా? లేకపోతే ఓటమితో సరిపెట్టుకుంటారా?
Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు