పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటించేసి నిర్మాత ఏఎం రత్నం ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రశాంతత ఆయనకు ఎన్నో రోజులు ఉండలేదు. గోటి చుట్టుపై రోకటి పోటు మాదిరిగా మరో సమస్య వచ్చి పడింది.
త్వరలో అంటే జూన్ 1 నుంచి టాలీవుడ్ బంద్ అంటూ ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు బాంబ్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా వారంతా సమావేశమై ఇక మీదట పర్సంటేజీ బేసిస్‌లో మాత్రమే థియేటర్లను కట్టబెడతామని తీర్మానించారు. అద్దె విధానం గిట్టిబాటు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిని డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్నారు. పర్సంటేజీలు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఎగ్జిబిటర్లంతా సమావేశమై జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పర్సంటేజి విధానాన్ని మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ థియేటర్లకు సైతం వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారట. ఈ సమస్య కొలిక్కి వస్తే ఓకే.. లేదంటే ‘హరి హర వీరమల్లు’కు కష్టాలేనని టాక్. ఈ గండం నుంచి గట్టెక్కుతుందో లేదో చూడాలి.